ఇటు సినిమా ఫీల్డ్.. అటు డిజిటల్ వరల్డ్.. దూసుకుపోతున్న సమంత!
on Nov 22, 2020
ఇలియానా తర్వాత టాలీవుడ్లో అతి తక్కువ కాలంలో అగ్ర నాయికగా ఎదిగిన తార సమంత. ఇప్పటివరకు ఆమె 24 తెలుగు సినిమాల్లో నటిస్తే వాటిలో 14 హిట్టయ్యాయంటే ఆమె హవా ఎలా నడుస్తోందో అర్థం చేసుకోవచ్చు. ఏ మాయ చేశావే, దూకుడు, ఈగ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది, మనం, అ ఆ, జనతా గ్యారేజ్, రంగస్థలం, మహానటి, మజిలీ, ఓ బేబీ లాంటి హిట్లు ఆమె లిస్టులో ఉన్నాయి. 2019లో 'మజిలీ', 'ఓ బేబీ' సినిమాలు ఆమెకు అమితమైన పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చాయి.
నాగచైతన్యతో వివాహానంతరం గ్లామరస్ రోల్స్‌ను కాకుండా పర్ఫార్మెన్స్కు ప్రాధాన్యం ఉన్న స్క్రిప్టులనే ఆమె ఓకే చేస్తూ వస్తున్నారు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే డిజిటల్ వరల్డ్ వైపు ఆమె దృష్టి సారించారు. తొలిసారిగా ఆమె నటించిన వెబ్ సిరీస్ 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' త్వరలో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్నది. ఈ సిరీస్‌తో చేసిన పాత్రతో అన్ని రూల్స్‌నూ బ్రేక్ చేశానని ఆమె ప్రకటించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇందులో ఆమె ఫైట్లు కూడా చేశారని సమాచారం. పైగా నెగటివ్ షేడ్స్ కూడా ఆమె క్యారెక్టర్లో ఉంటాయంటున్నారు. తెలుగువారైన రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేసిన ఈ సిరిస్‌లో మనోజ్ బాజ్‌పేయి, ప్రియమణి దంపతులుగా నటించారు.
ఈ వెబ్ సిరీస్ కాకుండా 'సామ్ జామ్' అనే టాక్ షో కూడా ఆమె నిర్వహిస్తుండటం విశేషం. ఫిల్మ్, స్పోర్ట్స్ తదితర రంగాలకు చెందిన సెలబ్రిటీలను ఈ షో ద్వారా ఆమె ఇంటర్వ్యూలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు తమిళ సినిమాలు కూడా ఉన్నాయి. తమిళ క్రిస్టియన్ అయిన సమంత రూత్ ప్రభు ఇవాళ సమంత అక్కినేనిగా టాలీవుడ్లో తనవైన పేజీలను రాస్తున్నారు. మున్ముందు ఆమె ఇంకెన్ని ఘనతలు సాధిస్తారో చూడాల్సిందే.
- YM
Also Read