'మీ టూ'పై సమంత స్పందన
on Oct 9, 2018
ప్రస్తుతం దేశంలో 'మీ టూ' మూమెంట్ నడుస్తోంది. సినీ తారలంతా తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి ధైర్యంగా ముందుకొచ్చి వెల్లడిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పటేకర్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ నటి తనుశ్రీ దత్తా చేసిన ఆరోపణలతో ఆరంభమైన ఈ ‘మీ టూ’ సంచలనం సినీ పరిశ్రమను పట్టి కుదిపేస్తోంది. తనుశ్రీ ఆరంభించిన ట్విట్టర్ సందేశ పరంపరను చూసి మరికొంతమంది నటీమణులు తమకు ఎదురైన అనుభవాలను బయటపెట్టటం మొదలుపెట్టారు. 'క్వీన్' సినిమా చిత్రీకరణ సమయంలో ఆ చిత్ర దర్శకుడు తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ ప్రముఖ హీరోయిన్ కంగనా రనౌత్ ఉత్తరాది నుంచి ‘మీ టూ’ ఉద్యమంలో దూకితే.. దక్షిణాదికి చెందిన గాయని చిన్మయి, నటి ఆషా శైనీ తామూ లైంగికంగా వేధింపులకు గురయ్యామంటూ వ్యాఖ్యలు చేశారు.
ఈ మూమెంట్‌కి చాలా మంది స్టార్ యాక్టర్స్ సపోర్ట్ ఇస్తున్నారు. తాజాగా స్టార్ హీరోయిన్ సమంత ఈ మూమెంట్‌కి తన మద్దతు తెలుపుతూ ట్వీట్ చేసారు. ‘మీ టూ’ మూమెంట్లో తాము ఎదుర్కొన్న వేధింపుల గురించి మాట్లాడేందుకు చాలా మంది మహిళలు ధైర్యంగా ముందుకు వస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీ ధైర్యం కొనియాడదగినది. కొందరు వ్యక్తులు మాత్రమే కాకుండా ఇతర మహిళలు కూడా మిమ్మల్ని అనుమానిస్తూ.. అవమానిస్తూ.. ఫ్రూఫ్స్ గురించి అడగటం సిగ్గు చేటు. మీరు చెబుతున్న విషయాలతో ఎందరో చిన్నారులకు రక్షణగా నిలుస్తున్నారని తెలుసుకోండి. థాంక్యూ. 'మీ టూ' మూమెంట్‌ని నేను సపోర్ట్ చేస్తున్నాను అని సమంత తెలిపారు.