రామ్‌చరణ్‌కు సల్మాన్ గ్రీన్ సిగ్నల్!
on Apr 12, 2021
రామ్‌చరణ్ హీరోగా ఓ మూవీని రూపొందించనున్నట్లు సౌత్ ఇండియా టాప్ డైరెక్టర్స్‌లో ఒకరైన శంకర్ ప్రకటించారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించనున్న 50వ సినిమా ఇదే కానున్నది. పాన్ ఇండియా లెవల్లో అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని నిర్మించనున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ఇందులో ఓ కీలక పాత్ర పోషించనున్నట్లు ప్రచారంలోకి రాగా, బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ సైతం ఈ సినిమాలో నటించనున్నాడంటూ లేటెస్ట్గా బజ్ మొదలైంది.
దేశవ్యాప్తంగా తన సినిమాకు మంచి పబ్లిసిటీ రావడం కోసం, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం కూడా వివిధ భాషలకు చెందిన పాపులర్ యాక్టర్స్‌ను శంకర్ తీసుకుంటూ ఉంటారు. 'రోబో 2.0' మూవీలో విలన్‌గా అక్షయ్‌కుమార్, 'ఐ' మూవీలో విలన్‌గా మలయాళం స్టార్ యాక్టర్ సురేశ్ గోపి, 'రోబో'లో హిందీ టాప్ యాక్టర్ డానీ డెంజోప్ప నటించిన విషయం తెలిసిందే.
అదే తరహాలో ఇప్పుడు రామ్‌చరణ్‌తో తను చేస్తున్న సినిమాలో సల్మాన్ ఖాన్‌ను ఓ కీలక పాత్ర కోసం శంకర్ సంప్రదించారని అంటున్నారు. దీనివల్ల నార్త్ బెల్ట్‌లో ఈ సినిమాకు మంచి క్రేజ్ వస్తుందనేది ఆయన ఆలోచన. ఇప్పటికే ఈ సినిమాలో చేయడానికి సల్మాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనీ, అయితే ఇంకా సంతకం చేయలేదనీ వినిపిస్తోంది. ఏదేమైనా అఫిషియల్ అనౌన్స్మెంట్ కోసం మనం వెయిట్ చేయాల్సిందే. జూలైలో ఈ సినిమాని సెట్స్ మీదకు తీసుకు వెళ్లాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈలోగా యాక్టర్స్, టెక్నీషియన్స్ లిస్ట్‌ను ప్రకటించే అవకాశం ఉంది.
చాలా కాలంగా కమల్ హాసన్‌తో శంకర్ తీస్తున్న 'ఇండియన్ 2' (భారతీయుడు 2) మూవీ షూటింగ్ నిలిచిపోయి ఉంది. దానికి సంబంధించి ఇంకా 20 శాతం సన్నివేశాలు మిగిలి ఉన్నాయి. రామ్‌చరణ్‌తో సినిమా స్టార్ట్ చేసే లోగా 'ఇండియన్ 2'ను ఆయన కంప్లీట్ చేయనున్నారు.
Also Read