శ్రద్ధా కపూర్ లవర్ అతడా?
on Oct 26, 2018
హైదరాబాదీ బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ బయోపిక్ తెరకెక్కుతోన్నవిషయం తెలిసిందే. ప్రభాస్ 'సాహో'లో హీరోయిన్గా నటిస్తున్న బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూరే, సైనా నెహ్వాల్ బయోపిక్‌లో సైనా క్యారెక్టర్లో నటిస్తున్నది. ఈ బయోపిక్‌లో సైనా నెహ్వాల్ సహరచ క్రీడాకారుడు, ప్రేమికుడు, త్వరలో కాబోయే భర్త పారుపల్లి కశ్యప్ క్యారెక్టర్ కూడా వుంది. అందులో శ్రద్ధాకి బాడ్మింటన్‌లో కోచింగ్ ఇచ్చిన ఇషాన్ నక్వీ నటిస్తున్నాడు. ఆల్రెడీ ఇషాన్, శ్రద్ధాలపై ఒక పాటను తెరకెక్కించార్ట. సైనా నెహ్వాల్ బయోపిక్‌లో నటిస్తున్నట్టు స్పష్టం చేసిన ఇషాన్, అంతకు మించి వివరాలు వెల్లడించలేనని తెలిపాడు. అయితే... సైనా నెహ్వాల్ రియల్ లవర్ పారుపల్లి కశ్యప్‌కి తన పాత్రలో ఇషాన్ నక్వీ నటిస్తున్న సంగతి తెలియదన్నాడు. సినిమాలో శ్రద్ధా కపూర్‌కి లవర్‌గా ఇషాన్ నటిస్తున్నాడా? అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
సైనా నెహ్వాల్ లవర్ క్యారెక్టర్ సినిమాలో వుందంటే అది కచ్చితంగా తనదే అయ్యి వుంటుందని పారుపల్లి కశ్యప్ తెలిపాడు. సైనా, తానూ పన్నెండేళ్లుగా కలిసి వుంటున్నామనీ, సైనా జీవితంలో మరో ప్రేమికుడు లేడనీ అతడు పేర్కొన్నాడు. "ఎవరో ఒకరు నా పాత్రలో నటిస్తున్నప్పుడు, నన్ను కలవకపోవడం ఆశ్చర్యంగా వుంది. నా గురించి ఏమీ తెలియకుండా నా పాత్రను ఎలా తెరకెక్కిస్తారు? ఈ విషయం సైనాకు కూడా తెలియదట. తను కూడా ఆశ్చర్యపోయింది. ఏ కాన్సెప్ట్‌లో క్యారెక్టర్ రూపొందించారో? చాలా రోజుల క్రితం గోపీచంద్ అకాడమీలో ఒకసారి బయోపిక్ రచయితలతో సమావేశం అయ్యాను. అప్పుడు నా క్యారెక్టర్ గురించి మాట్లాడుకున్నాం. తరవాత మళ్లీ కలవలేదు. రీసెర్చ్ చేసి నా క్యారెక్టర్ చూపిస్తున్నారని అనుకుంటున్నా" అని పారుపల్లి కశ్యప్ పేర్కొన్నాడు.