English | Telugu

'సాహో' రిస్కేనా?

on Aug 21, 2019

 

ప్రభాస్ హీరోగా అత్యంత భారీ బడ్జెట్‌తో తయారైన 'సాహో'పై అంచనాలకు హద్దే లేకుండా పోతోంది. శ్రద్ధా కపూర్ టాలీవుడ్‌కు పరిచయమవుతున్న ఈ సినిమాని 'రన్ రాజా రన్' ఫేం సుజిత్ డైరెక్ట్ చేశాడు. ఆగస్ట్ 30న రిలీజవుతున్న ఈ సినిమా 'బాహుబలి 2'కి మించిన బడ్జెట్‌తో తయారయ్యిందనే వార్త ఒక వైపు సంతోషాన్ని కలిగిస్తున్నా, మరోవైపు భయాన్నీ పుట్టిస్తోంది. 'బాహుబలి' జానపద చిత్రం కావడం, అందులో కోట సెట్లు, కాస్టూమ్స్, యుద్ధ సన్నివేశాలు, వీఎఫ్ఎక్స్‌కు ప్రాధాన్యం ఉండటం వల్ల రూ. 250 కోట్ల బడ్జెట్ అవసరమైంది. 'బాహుబలి - ద బిగినింగ్' తెచ్చిన క్రేజ్ ఉపకరించడంతో థియేట్రికల్ రన్‌తోటే పెట్టుబడిని మించి కలెక్షన్లు వచ్చి, అందరికీ లాభాలు పంచాయి.

అదే క్రేజ్ 'సాహో'కు కూడా పనికొస్తుందని ఆ సినిమా నిర్మాతలు నమ్ముతున్నారు. అయితే 'సాహో' కథాంశం, దాని జోనర్ వేరు. ప్రేమ కథ మేళవించిన రివెంజ్ డ్రామాగా ఈ సినిమా రూపొందిందని తెలుస్తోంది. సినిమాలో ఎమోషన్స్ కంటే యాక్షన్ ఎపిసోడ్స్‌పైనే డైరెక్టర్ ఎక్కువ దృష్టిపెట్టి ఈ సినిమా తీశాడని అంతర్గత వర్గాల సమాచారం. మితిమీరిన యాక్షన్ సీన్స్‌ను ఫ్యామిలీ ఆడియెన్స్ ఎంతవరకు ఆదరిస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. మూడు రోజుల క్రితం రామోజీ ఫిల్మ్ సిటీలో అత్యంత గ్రాండ్ స్కేల్‌లో 'సాహో' ప్రి రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఆ స్థాయి వేదికైతేనే ప్రభాస్ రేంజికి సరిపోతుందని నిర్మాతలు భావించి ఉండాలి.

రాజమౌళి, వినాయక్, కృష్ణంరాజు, అల్లు అరవింద్ వంటి పెద్దవాళ్లు 'సాహో' గురించీ, ప్రభాస్ గురించీ, సుజిత్ గురించీ చాలా చాలా గొప్పగా మాట్లాడారు. నిర్మాతలు భయపడకుండా పులికీ, సింహానికీ ఉండే ధైర్యంతో భారీగా డబ్బులు ఖర్చుపెట్టి సినిమాని నిర్మించారని కొనియాడారు. ప్రభాస్ సైతం నిర్మాతలు 100 కోట్ల రూపాయల లాభాన్ని వదులుకొని, ఎక్కువ ఖర్చుపెట్టారని చెప్పాడు. ఈ మాటలతో, ఈ వేడుకతో 'సాహో'పై హైప్ మరింత పెరిగింది. ఇది సినిమా మీద అనవసర ఒత్తిడిని కలిగిస్తోందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంత భారీ బడ్జెట్ పెట్టినా, కొన్ని సీన్లలో వీఎఫ్ఎక్స్ వర్క్ ఆశించినంత క్వాలిటీగా రాలేదని అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. కేవలం వీఎఫ్ఎక్స్, యాక్షన్ ఎపిసోడ్స్, గ్రాండియర్‌ను నమ్ముకొని ఈ సినిమాని తీసినట్లున్నారనే మాటలు వినిపిస్తున్నాయి.

ఏ సినిమా విజయానికైనా కథ కానీ, కథనం కానీ, ఎమోషన్స్ కానీ దోహదం చేస్తాయి. ఫైట్సో, గ్రాఫిక్సో సినిమాకి విజయాన్ని సాధించిపెట్టలేవు. 'సాహో' స్టోరీలో ఎమోషన్స్ బాగా పండితే.. ఆ సినిమా బ్లాక్‌బస్టర్ కాకుండా ఏ శక్తీ అడ్డుకోలేదు. వందల కోట్ల రూపాయల వ్యాపారం జరుపుకున్న 'సాహో' బ్లాక్‌బస్టర్ అయితే అంతకంటే టాలీవుడ్‌కు కావాల్సింది ఉండదు. రిజల్ట్‌లో ఏ మాత్రం తేడా వచ్చినా బయ్యర్ల పరిస్థితి ఏమవుతుందో ఊహించుకోడానికే భయం వేస్తోంది. ఆ భయం నిజం కాకూడదని కోరుకుందాం.


Cinema GalleriesLatest News


Video-Gossips