'ఆర్ ఆర్ ఆర్'ను భుజాలకెత్తుకున్న తారక్ ఫ్యాన్స్
on Dec 11, 2019
'ఆర్ఆర్ఆర్'.. 2020లో రానున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియా మూవీ. ఎస్.ఎస్. రాజమౌళి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ హీరోలుగా నటిస్తున్న విషయం తెలిసిందే. 20వ శతాబ్దం తొలినాళ్లలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, గోండు యోధుడు కొమరం భీమ్ ఒకరికొకరు కలుసుకున్నప్పుడు ఏం జరిగి వుంటుందనే కల్పిత కథతో తయారవుతున్న ఈ సినిమాలో అల్లూరిగా రాంచరణ్, భీమ్ గా చిన్న ఎన్టీఆర్ నటిస్తున్నారు. కాగా మంగళవారం ఈ సినిమాకు సంబంధించి ఒక వీడియో క్లిప్ లీకవడం సంచలనం సృష్టించింది. విశాఖ ఏజెన్సీలోని పాడేరులో తారక్‌పై చిత్రీకరిస్తున్న ఒక సన్నివేశాన్ని ఎవరో సెల్ఫోన్లో చిత్రీకరించారు. ఇది లీకై సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. అందులో ఎరుపు రంగు తలపాగాతో ఉన్న తారక్ లుక్ వెల్లడైంది. వెంటనే అప్రమత్తమైన తారక్ అభిమానులు ఆ వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలోని అన్ని ప్లాట్‌ఫాంల నుంచి తొలగించడానికి కృషిచేసి సఫలీకృతులయ్యారు.
వీడియో లీకేజీపై 'ఆర్ ఆర్ ఆర్' చిత్ర బృందం ఫిర్యాదు చేయడంతో పోలీసులు సైతం రంగంలోకి దిగారు. దాంతో అప్పటికే ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా సైట్లలో ఆ క్లిప్‌ను షేర్ చేసిన వాళ్లు దాన్ని తొలగించారు. నిర్మాతలు అధికారికంగా ఫస్ట్ లుక్‌ను వెల్లడి చెయ్యక ముందే ఈ మూవీలో తారక్ ఎలా కనిపిస్తాడనే విషయాన్ని బయటపెట్టిన ఆ క్లిప్ వైరల్ కాకముందే తారక్ ఫ్యాన్స్ అప్రమత్తమై తీసుకున్న చర్యలపై చిత్ర బృందం సంతోషాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. ఒకవైపు తారక్ ఫ్యాన్స్, మరోవైపు చరణ్ ఫ్యాన్స్ ఇద్దరూ.. 'ఆర్ ఆర్ ఆర్'కు సంబంధించి దొంగదారిన ఎలాంటి లీకేజీలు బయటకు రాకుండా వేయికళ్లతో పరికిస్తూ వస్తున్నారు. అయితే కొంతమంది ఫ్యాన్స్ అత్యుత్సాహంతో ఈ వీడియో లీకేజీపై ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకోవడం దర్శక నిర్మాతల్ని కలవరపెడుతోంది. తారక్, చరణ్ క్లోజ్ ఫ్రెండ్స్‌గా మూవ్ అవుతుంటే, కొంతమంది వాళ్ల ఫ్యాన్స్ ఇలా కామెంట్లతో ఒకరినొకరు తిట్టుకోవడం తగదని వాళ్లు చెబుతున్నారు. తారక్ సరసన బ్రిటిష్ నటి ఒలీవియా మోరిస్, చరణ్ జోడీగా అలియా భట్ నటిస్తోన్న ఈ సినిమాలో అజయ్ దేవ్‌గణ్, సముద్రకని, హాలీవుడ్ యాక్టర్ రే స్టీవెన్సన్, అలీసన్ డూడీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.
Also Read