'రామరాజు ఫర్ భీమ్' టీజర్.. భీమ్ వచ్చాడు.. భీకరంగా చెలరేగాడు!
on Oct 22, 2020
ఆకాశమే హద్దుగా ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగా పెరుగుతున్న 'ఆర్ఆర్ఆర్' మూవీలో గోండు వీరుడు కొమరం భీమ్ క్యారెక్టర్‌ను పోషిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ టీజర్‌ను 'రామరాజు ఫర్ భీమ్' పేరిట ముందు చెప్పినట్లుగా గురువారం అంటే అక్టోబర్ 22 ఉదయం 11 గంటలకు కాకుండా ఒక అరగంట లేటుగా ఇటు 'రామరాజు' రామ్ చరణ్, అటు మూవీ అఫిషియల్ ట్విట్టర్ హ్యాండిల్స్ ద్వారా రిలీజ్ చేశారు. ఈ టీజర్ కోసం తారక్ ఫ్యాన్స్ ఆరు నెలలుగా కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తూ వచ్చిన విషయం తెలిసిందే. అయితే 11 గంటలకు వస్తుందనుకున్న టీజర్ అరగంట ఆలస్యంగా వస్తుందనేసరికే వారిలో అసహనం కట్టలు తెంచుకుంది. మరో 30 నిమిషాలు అంటూ రాజమౌళి చేసిన ట్వీట్‌కు తారక్ ఫ్యాన్స్ నుంచి వచ్చిన స్పందనే దీనికి నిదర్శనం.
వాళ్లంతా అదివరకు చరణ్ బర్త్‌డే సందర్భంగా వచ్చిన 'భీమ్ ఫర్ రామరాజు' టీజర్ తరహాలోనే మే 20న తారక్ బర్త్‌డే సందర్భంగా 'రామరాజు ఫర్ భీమ్' టీజర్ వస్తుందని ఎంతగానో ఆశించారు. కానీ కరోనా మహమ్మారి కారణంగా లాక్డౌన్ నిబంధనలు అమలులో ఉండటం, ఆ టీజర్ తయారుచేయడానికి అవసరమైన టెక్నికల్ వర్క్ చేసే అవకాశం లేకపోవడంతో తారక్ బర్త్‌డేకి అది రాలేదు. దాంతో ఫ్యాన్స్ తీవ్రస్థాయిలో డిజప్పాయింట్ అయ్యారు. అప్పట్నుంచీ వారు ఆ టీజర్ కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో చెప్పనలవి కాదు. వారి ఇన్నాళ్ల ఎదురుచూపుకు పూర్తి న్యాయం చేసే రీతిలో వచ్చింది 'రామరాజు ఫర్ భీమ్' టీజర్.
అడవుల్లోకి ఫోకస్ చేయడంతో టీజర్ మొదలైంది. నీటిలోంచి అడుగులు కదిలాయి. మొదట కాళ్లు కనిపించాయి. "వాడు కనపడితే సముద్రాలు తడబడతాయ్. నిలబడితే సామ్రాజ్యాలు సాగిలపడతాయ్. వాడి పొగరు ఎగిరే జెండా.. వాడి ధైర్యం చీకట్లను చీల్చే మండుటెండ.. వాడు భూతల్లి చనుబాలు తాగిన మన్నెం ముద్దుబిడ్డ.. నా తమ్ముడు.. గోండు బెబ్బులి.. కొమరం భీమ్" అని భీమ్ క్యారెక్టర్ రామరాజు పాత్రధారి రామ్ చరణ్ గంభీరమైన వాయిస్‌తో పరిచయం చేస్తుంటే రోమాలు నిక్కబొడుచుకోని వాళ్లెవరు! ఒళ్లు జలదరించకుండా ఉండే వాళ్లెవరు!! ఈ పరిచయ క్రమంలో కొమరం భీమ్‌గా తారక్ కనిపించిన తీరు ఎవరినైనా సంభ్రమాశ్చర్యాలకు గురిచేయక మానదు. నిలువెల్లా కండలు తిరిగిన దేహంతో, ఇదివరకెన్నడూ కనిపించని రూపంతో, పూర్తి స్థాయి బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్‌తో కనిపించాడు తారక్.
అతడు రాయిమీద నిల్చుంటే అతడి ముందు ఉవ్వెత్తున లేచిన సముద్రం అల అతడి మీద పడకుండా విడిపోయి రెండు పక్కలకూ వెళ్లిపోయింది. నీటి లోంచి ఈటెను తీసి విసిరితే గమ్యాన్ని తుత్తునియలు చేసింది. పొడవాటి జెండాకు ఉన్నంత పొగరు అతడిది. అగ్నిపర్వతం బద్దలయ్యేంత ఆవేశం అతడిది. "నా తమ్ముడు గోండు బెబ్బులి కొమరం భీమ్" అని రామరాజు గొంతు వినిపిస్తున్నప్పుడు రెండు చేతులతో రెండు తాళ్లను బలంగా లాగుతున్న భీమ్ రూపం భీకరంగా కనిపించింది. నెత్తురోడుతున్న ముఖంతో "ఆ..." అని అంతకంటే భీకరంగా గర్జించాడు భీమ్. అడవిలో అతి వేగంగా అతడు పరిగెత్తుతున్న తీరు అతడికి ఆ అడవి ఎంతటి నేస్తమో తెలియజేస్తోంది.
అప్పటి దాకా అంత ఫెరోషియస్‌గా కనిపించిన భీమ్.. టీజర్ చివరలో కళ్లకు సుర్మా రాసుకొని, తలకు తెల్ల టోపీ పెట్టుకొని, ముస్లిం వేషధారణలో ప్రశాంతంగా కొండమీదుగా నడిచివస్తున్న వైనం మనల్ని మరింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇన్ని రోజులుగా, నెలలుగా అభిమానులు ఎదురుచూస్తున్న దానికి అనేక రెట్లు న్యాయం చేసేలా 'రామరాజు ఫర్ భీమ్' టీజర్ మన ముందుకు వచ్చిందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇదివరకు 'భీమ్ ఫర్ రామరాజు'కు తన వాయిస్‌తో తారక్ ఎంత క్రేజ్ తెచ్చాడో, ఇప్పుడు 'రామరాజు ఫర్ భీమ్' టీజర్‌కు చరణ్ తన వాయిస్‌తో అంతే క్రేజ్ తీసుకు వస్తాడని చెప్పడానికి సందేహించాల్సిన పనిలేదు.
ఏం చేస్తే తన సినిమాకు లాభం కలుగుతుందో కచ్చితంగా ఆ పనిచేసే డైరెక్టర్‌గా యస్.యస్. రాజమౌళి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన కొంతమంది ఫక్తు మెటీరియలిస్టిక్ డైరెక్టర్ అని పిలవవచ్చు గాక. కానీ తన సినిమాలతో తనకే కాకుండా, వాటిలో నటించినవాళ్లకూ, నిర్మాతలకూ, బిజినెస్‌పరంగా వాటితో సంబంధం ఉన్నవాళ్లందరికీ లాభాలు తెచ్చే ప్రాఫిటబుల్ డైరెక్టర్ అని ఘంటాపథంగా చెప్పవచ్చు. ఇప్పుడు 'రామరాజు ఫర్ భీమ్' కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ సినీ ప్రేమికులు ఎదురుచూసేలా చేయడంలో ఆయన గొప్పగా సక్సెస్ అయ్యారు. ఆయన ప్లాన్‌ను బాగా అమలు చేయడంలో ఆయన హీరోలు కూడా తమ వంతు సపోర్ట్‌ను అందిస్తున్నారు. సోషల్ మీడియాలో మంచి మసాలా ట్వీట్లతో జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ సంయుక్తంగా 'రామరాజు ఫర్ భీమ్' టీజర్‌పై ఉత్కంఠను అనూహ్య స్థాయిలో పెంచేశారు.
అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్, కొమరం భీమ్‌గా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తోన్న ఈ సినిమా చరిత్ర చెప్పని కోణంలో మన ముందుకు రానున్నది. స్వాతంత్ర్య సంగ్రామానికీ, ఆర్ఆర్ఆర్ సినిమా కథకూ ఎలాంటి సంబంధం ఉండదని మేకర్స్ ఇటీవలే స్పష్టం చేశారు. ఇంట్లోంచి వెళ్లిపోయిన ఇద్దరు వీరులు రామరాజు, భీమ్ ఎక్కడ, ఎలా కలుసుకున్నారు.. ఏం చేశారనే ఫిక్షనల్ స్టోరీతో రాజమౌళి ఈ మూవీని తీర్చిదిద్దుతున్నాడు. 2021 వేసవికి వచ్చే ఆర్ఆర్ఆర్ ఎన్ని సంచలనాలు సృష్టించబోతోందో చూడ్డమే మనం చేయాల్సిన పని.