'ఆర్ఆర్ఆర్' రికార్డుల వేటలో బాహు'బలి'!
on Feb 8, 2020
'బాహుబలి 2' రికార్డుల్ని బద్దలు కొట్టే సినిమా ఇప్పట్లో వస్తుందా?.. అని సందేహించేవాళ్లకు సమాధానం చాలా తొందరగానే లభిస్తోంది. యస్.యస్. రాజమౌళి సినిమా రికార్డుల్ని మళ్లీ ఆయన సినిమాయే తిరగరాసేందుకు రెడీ అవుతోంది. అందులో తొలి అడుగును రాజమౌళి లేటెస్ట్ ఫిల్మ్ 'ఆర్ఆర్ఆర్' వేసేసింది. 'బాహుబలి 2' ప్రి రిలీజ్ బిజినెస్ రికార్డును ఆ సినిమా భారీ మార్జిన్‌తో తిరగరాస్తోంది. 'బాహుబలి' సాధించిన రికార్డులతో 'బాహుబలి 2' మూవీ విడుదలకు ముందు రెండు తెలుగు రాష్ట్రాల బయ్యర్లు 122 కోట్ల రూపాయలను దానిపై కుమ్మరించారు. అది అనూహ్యం. అలా ప్రి రిలీజ్ బిజినెస్ పరంగా 'బాహుబలి 2' ఒక బెంచ్ మార్కును సెట్ చేసింది. దాని తర్వాత వచ్చిన ప్రభా సినిమా 'సాహో' ప్రి బిజినెస్‌ను రికార్డుల కోసం ఎక్కువ చేసి చూపించారు. ఎలా అంటే.. నైజాం హక్కుల్ని 40 కోట్ల రూపాయలుగా ట్రేడ్ విశ్లేక్షకులు తెలిపారు కానీ, నైజాంలో ఆ సినిమాని రిలీజ్ చేసింది 'సాహో' నిర్మాతలే. కాబట్టి దాని బిజినెస్‌ను మనం పరిగణనలోకి తీసుకోలేం.
ఆ ప్రకారం చూస్తే, 'ఆర్ఆర్ఆర్' మూవీ కోసం ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల బయ్యర్లు వెచ్చిస్తున్న డబ్బు ఎంతో తెలుసా? రూ. 200 కోట్ల రూపాయల పైమాటే. ఎక్కడి రూ. 122 కోట్లు? ఎక్కడి రూ. 200 కోట్లు? నైజాంలో 'బాహుబలి 2'ను రూ. 40 కోట్లకు కొన్న దిల్ రాజు, ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్' కోసం ఏకంగా రూ. 75 కోట్లు పెడుతున్నారని విశ్వసనీయ సమాచారం. అదే తరహాలో సీడెడ్, ఆంధ్రా ఏరియాల హక్కులు కూడా భారీ రేట్లకు అమ్ముడయ్యాయి. ఈ సినిమా హక్కుల్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలని పలువురు పేరుపొందిన డిస్ట్రిబ్యూటర్లు పోటీపడటం వల్లే ఈ స్థాయిలో థియేట్రికల్ రైట్స్ అమ్ముడయ్యాయి. ఈ మధ్య కాలంలో నైజాంతో పాటు ఉత్తరాంధ్ర హక్కుల్ని కూడా పొందుతూ వస్తోన్న దిల్ రాజుకు 'ఆర్ఆర్ఆర్' ఉత్తరాంధ్ర హక్కులు దక్కలేదు. వాటిని రూ. 30 కోట్లకు సాయి కొర్రపాటి దక్కించుకున్నట్లు వినిపిస్తోంది.
అలాగే సీడెడ్ రైట్స్ కూడా కనీ వినీ ఎరుగని రేంజిలో రూ. 40 కోట్లు పలికాయని ప్రచారం జరుగుతోంది. ఈస్ట్ గోదావరి రూ. 18 కోట్లు, వెస్ట్ గోదావరి రూ. 14 కోట్లు, కృష్ణా రూ. 15 కోట్లు, గుంటూరు రూ. 18 కోట్లు, నెల్లూరు రూ. 9 కోట్లు పలికాయని సన్నిహిత వర్గాలు తెలిపాయి. వెరసి.. రూ. 219 కోట్లు! ఈ లెక్కల్లో కొంచెం అటూ ఇటూ తేడా ఉన్నా రూ. 200 కోట్లు ఖాయంగా రానున్నాయి. జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ వంటి మాస్లో అమితంగా ఫాలోయింగ్ ఉన్న స్టార్స్ రాజమౌళితో చేస్తుండటంతో ట్రేడ్ వర్గాలు ఈ మూవీపై భారీ అంచనాలు పెట్టుకున్నాయి. అందుకు తగ్గట్లే విడుదలకు ఏడాది ముందుగానే 'బాహుబలి 2'ను సునాయాసంగా దాటేస్తూ ఈ సినిమాకి బిజినెస్ జరిగింది. 2021 జనవరి 8న 'ఆర్ఆర్ఆర్' విడుదలవుతోంది.