English | Telugu

'ఆర్ఆర్ఆర్' అస‌లు టైటిల్‌.. 'రౌద్రం ర‌ణం రుధిరం'

on Mar 25, 2020

 

దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఎప్ప‌డెప్పుడా అని ఎదురుచూస్తున్న క్ష‌ణం వ‌చ్చేసింది. య‌స్‌.య‌స్‌. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో జూనియ‌ర్ ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా న‌టిస్తోన్న, ఇప్ప‌టివ‌ర‌కూ 'ఆర్ఆర్ఆర్' అనే వ‌ర్కింగ్ టైటిల్ ఉప‌యోగిస్తూ వ‌స్తోన్న చిత్రానికి 'రౌద్రం ర‌ణం రుధిరం' అనే టైటిల్ ఖ‌రారు చేశారు. శార్వ‌రి నామ సంవ‌త్స‌ర ఉగాది పండుగ సంద‌ర్భంగా బుధ‌వారం మ‌ధ్యాహ్నం స‌రిగ్గా 12 గంట‌ల‌కు టైటిల్‌ను సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌క‌టించారు. దీనికి సంబంధించిన లోగో, మోష‌న్ పోస్ట‌ర్‌ను ఆవిష్క‌రించారు. టైటిల్ లోగోలోని తొలి 'ఆర్‌'లో రామ్‌చ‌ర‌ణ్ ముఖం, మూడో 'ఆర్‌'లో జూనియ‌ర్ ఎన్టీఆర్ ముఖం డిజైన్ చేయ‌గా,  రెండో 'ఆర్‌'లో 'ఇండియా 1920' అనే అక్ష‌రాలు, వాటి కింద గ‌ట్టిగా ఒక‌దాన్నొక‌టి గ‌ట్టిగా ప‌ట్టుకున్న రెండు చేతులను డిజైన్ చేశారు. 

"నీరు నిప్పును ఆర్పుతుంది!
నిప్పు నీటిని ఆవిరి చేస్తుంది!
ఆ రెండు శ‌క్తులూ మ‌హాబ‌లంతో క‌లిసి వ‌స్తున్నాయి.. ఆర్ఆర్ఆర్ టైటిల్ లోగోను ప్ర‌జెంట్ చేయ‌డానికి!!!" అంటూ మోష‌న్ పోస్ట‌ర్‌ను త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు రాజ‌మౌళి.

అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో రామ్‌చ‌ర‌ణ్‌ను నిప్పులా, కొమ‌రం భీమ్ పాత్ర‌లో జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను నీరులా ఆయ‌న సినిమాలో చూపిస్తున్న‌ట్లు మోష‌న్ పోస్ట‌ర్‌ను బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది. చ‌ర‌ణ్ ప‌రుగులు పెడుతుంటే నిప్పులు కురుస్తుండ‌గా, తార‌క్ ఉరుకుతుంటే నీరు చిమ్ముతున్న‌ట్లుగా పోస్ట‌ర్ చూపెడుతోంది. చ‌ర‌ణ్ రంగుల డ్ర‌స్‌, తార‌క్ వైట్ అండ్ వైట్ డ్ర‌స్సూ వేసుకొని ప‌రుగెత్తుతున్నారు. కీర‌వాణి బీజియ‌మ్‌తో మోష‌న్ పోస్ట‌ర్‌ను చూస్తుంటే గూస్‌బంప్స్ వ‌స్తున్నాయ‌ని ఫ్యాన్స్‌తో పాటు అనేక‌మంది కామెంట్లు పెడుతున్నారు. వారిలో మెగాస్టార్ చిరంజీవి నుంచి అఖిల్ అక్కినేని దాకా ఉన్నారు. "టోట‌ల్ ఐ ఫీస్ట్ అండ్ గూస్‌బంప్స్" అని స్వ‌యానా మెగాస్టార్ ట్వీట్ చేశారు. కీర‌వాణి సంగీతాన్ని ఎల‌క్ట్రిఫ‌యింగ్ స్కోర్ అంటూ ప్ర‌శంసించారు. "స్ప్లెండిండ్ జాబ్ బై వ‌న్ అండ్ వోన్లీ య‌స్‌.య‌స్‌. రాజ‌మౌళి. తార‌క్‌, చ‌ర‌ణ్ ఆబ్స‌ల్యూట్‌లీ ఫెంటాస్టిక్" అని ఆయ‌న అభివ‌ర్ణించారు.

అనేక‌మంది మ‌నం ఊహించిన దానికి మించి ఇవ్వ‌డం రాజ‌మౌళికి అల‌వాటుగా మారిందనీ, 'రౌద్రం ర‌ణం రుధిరం' టైటిల్ లోగో డిజైన్‌, మోష‌న్ పోస్ట‌ర్ ఆ విష‌యాన్ని మ‌రోసారి రుజువు చేశాయ‌ని వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ రోజు 12 గంట‌ల‌కు టైటిల్‌ను ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు ప‌ది గంట‌ల‌కు వెల్ల‌డించారు. అప్ప‌ట్నుంచీ రెండు గంట‌ల సేపు అత్యంత ఉత్కంఠ‌తో 'ఆర్ఆర్ఆర్' ఫ్యాన్స్‌తో పాటు రాజ‌మౌళి, తార‌క్‌, చ‌ర‌ణ్ ఫ్యాన్స్ టైటిల్ ప్ర‌క‌ట‌న కోసం ఎదురు చూస్తూ వ‌చ్చారు. చెప్పిన స‌మ‌యానికి ఉత్కంఠ వీడింది. క్ష‌ణాల వ్య‌వ‌ధిలోనే ఈ టైటిల్ ఆన్‌లైన్‌లో వైర‌ల్ అయింది. క‌రోనా వైర‌స్ క‌రాళ నృత్యం చేస్తూ, దేశంలోని ప్ర‌జ‌లంద‌రినీ ఇంటికే ప‌రిమితం చేసిన నేప‌థ్యంలో ఈ సినిమా ఫ్యాన్స్ మాత్రం ఉగాది పండుగ‌ను 'రౌద్రం ర‌ణం రుధిరం' టైటిల్ ప్ర‌క‌ట‌న‌తో సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు. హిందీ వెర్ష‌న్‌కు 'రైజ్ రోర్ రివోల్ట్' అనే టైటిల్ పెట్టారు. దీనిని అజ‌య్ దేవ్‌గ‌ణ్ త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా ఆవిష్క‌రించారు.

అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌ను రామ్‌చ‌ర‌ణ్‌, కొమ‌రం భీమ్ క్యారెక్ట‌ర్‌ను జూనియ‌ర్ ఎన్టీఆర్ పోషిస్తోన్న ఈ చిత్రంలో హీరోయిన్లుగా అలియా భ‌ట్‌, ఒలీవియా మోరిస్ న‌టిస్తున్నారు. అజ‌య్ దేవ్‌గ‌ణ్‌, స‌ముద్ర‌క‌ని, శ్రియ కీల‌క పాత్ర‌ధారులు. యం.యం. కీర‌వాణి సంగీతం స‌మ‌కూరుస్తుండ‌గా, కె.కె. సెంథిల్‌కుమార్ సినిమాటోగ్రాఫ‌ర్ ప‌నిచేస్తున్నారు. 2021 జ‌న‌వ‌రి 8న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని నిర్మాత డి.వి.వి. దాన‌య్య స‌న్నాహాలు చేస్తున్నారు.


Cinema GalleriesLatest News


Video-Gossips