English | Telugu

'కడప' రూపంలో మరోసారి ఆర్జీవీ తీస్తున్న రాయలసీమ రక్త చరిత్ర!

on Sep 5, 2019

 

రాంగోపాల్ వర్మ 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమా చేస్తానని ప్రకటించి, అందుకు ప్రయత్నాలు మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఆ ప్రాజెక్టులో భాగంగా 'కేస్ట్ ఫీలింగ్' సాంగ్‌ని కూడా కొద్ది రోజుల క్రితం విడుదల చేశాడు ఆర్జీవీ. అది తెలుగు సమాజంలో కలకలం సృష్టిస్తోంది. కాగా దాని కంటే ముందుగా తను రెండేళ్ల క్రితమే ప్రకటించిన 'కడప' వెబ్ సిరీస్‌ను రిలీజ్ చెయ్యాలని ఆర్జీవీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. 

2017 డిసెంబర్‌లో 'కడప' వెబ్ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్‌ని సైతం తన సొంత యూట్యూబ్ చానల్ ద్వారా ఆర్జీవీ రిలీజ్ చేశారు. కానీ అప్పట్లో దానిపై తీవ్ర విమర్శలు రేగడం వల్లనో, మరో కారణం చేతనో ఆయన ఆ ప్రాజెక్టును ఆపేశారు. "రాయలసీమ మగోళ్లు అమ్మ కడుపులో నుంచే కత్తి పట్టుకొని పుడతారు" అనేది అక్కడివాళ్ల నమ్మకమని ఆ ట్రైలర్‌లో చెప్పిన వర్మ, "అదే పనిగా పెట్టుకుంటే ఎవడినైనా చంపవచ్చు" అనే ఫ్యాక్షనిస్ట్ రాజారెడ్డి కొటేషన్‌ను చూపించారు. "ఇందులో ఉన్న ఏ ఒక్క పాత్ర కూడా కల్పితం కాదు. కానీ ప్రాణభయం వలన వాళ్లందరి పేర్లూ, వాళ్లు నివసించిన కొన్ని ఊళ్ల పేర్లు కూడా మార్చడం జరిగింది. ఈ కథ నాకు తెలిసిన నిజం కాదు. నూటికి నూరు పాళ్లూ, ముమ్మాటికీ నిజం" అంటూ వర్మ చెప్పే వాయిస్ ఓవర్‌తో ఆ ట్రైలర్ మొదలవుతుంది. 

ఆ తర్వాత "కన్నుకు కన్ను, సమాధానం కాని సమాధానం" అనే వైఎస్ రాజశేఖరరెడ్డి కొటేషన్, "పగలేని బతుకు బతుకే కాదు" అనే బాంబుల శివారెడ్డి కొటేషన్, "బలం వాడనివాడు కొజ్జాగాడు" అనే ఓబుల్‌రెడ్డి కొటేషన్, "ఒక్కడిని చంపితే మర్డర్.. వందమందిని చంపితే లీడర్' అనే పరిటాల రవి కొటేషన్ చూపించారు. 'ఎ ట్రూ స్టోరీ ఆఫ్ రియల్ వయొలెన్స్' అంటూ అక్కడ జరిగే దారుణాలను, భీతిగొలిపే హింసనూ, అక్కడి మనుషుల మాటల్నీ, చిన్న పిల్లల్లో సైతం ఫ్యాక్షన్ పగ ఏ రీతిలో ఉంటుందో అనే విషయాన్నీ భయానకంగా చూపించారు. "ఫ్యాక్షనమ్మ వెలిసింది సీమలో. ఆ అమ్మ గుడి రాయలసీమ అయితే, దాని గర్భగుడి కడప. ఇది రాయలసీమ రెడ్ల చరిత్ర" అంటూ రాంగోపాల్ వర్మ చెప్పే వాయిస్ ఓవర్‌తో ఆ ట్రైలర్ ముగుస్తుంది.

ఇప్పటికే రాయలసీమ రెడ్లను కరడుగట్టిన ఫ్యాక్షనిస్టులుగా 'సమరసింహారెడ్డి', 'ఇంద్ర', 'ఆది', 'ఒక్కడు', 'చెన్నకేశవరెడ్డి', 'రక్త చరిత్ర', లేటెస్టుగా 'అరవింద సమేత' తదితర ఎన్నో సినిమాల్లో చూసిన మనం, మరోసారి తాజాగా 'కడప' అనే వెబ్ సిరీస్ ద్వారా తిలకించబోతున్నాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిస్థితులు మారాయి. వర్మ మద్దతిచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన 'కడప' వెబ్ సిరీస్‌ను తిరిగి రంగం మీదికి తీసుకొస్తుండటం గమనార్హం. 

విశ్వసనీయ సమాచారం ప్రకారం మరి కొద్ది రోజుల్లోనే ఈ సిరీస్ షూటింగ్ మొదలవనున్నది. తొలి సీజన్ 12 ఎపిసోడ్లు ఉంటుందని తెలుస్తోంది. ఆర్జీవీ డైరెక్ట్ చేసే ఈ సిరీస్ అక్టోబర్‌లో రిలీజయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాయలసీమలో 'ఫ్యాక్షన్' అనేది గతానికి సంబంధించిన చీకటి కోణమనీ, ఇప్పుడు ఫ్యాక్షన్‌కు దూరంగా సీమ సమాజం ప్రశాంతంగా బతుకుతోందనీ, మళ్లీ పాత గాయాల్ని రేపినట్లుగా సినిమాల్లో ఫ్యాక్షన్‌ను చూపించొద్దని కోరుతూ, గొడవ చేస్తూ వస్తోన్న రాయలసీమ నాయకులు, మేధావులు.. ఇప్పుడు వర్మ తీసుకురానున్న 'కడప' వెబ్ సిరీస్ విషయంలో ఎలా స్పందిస్తారో చూడాలి. వాళ్ల కంటే ముందు అసలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంతి వైఎస్ జగన్మోహనరెడ్డి స్పందన ఎలా ఉంటుందన్నది ఆసక్తికరం.


Cinema GalleriesLatest News


Video-Gossips