చంద్రబాబు లాంటి వ్యక్తి డీటైల్స్ చెప్తే లక్ష ఇస్తా: వర్మ
on Oct 13, 2018
రామ్ గోపాల్ వర్మ సంచలనాలకు పెట్టింది పేరు. ఒకప్పుడు సినిమాలతో సంచలనాలు సృష్టించిన వర్మ.. తరువాత సంచలన వ్యాఖ్యలతో కాలం వెళ్లబుచ్చుతూ వస్తున్నారు. వర్మ కరెక్ట్ హిట్ సినిమా ఇచ్చి ఎన్నో ఏళ్లయింది. ప్రేక్షకులు కూడా దాదాపు వర్మ సినిమాలను పట్టించుకోవడం మానేశారు. అయినా వర్మ తీరు మారలేదు. ప్రేక్షకుల రియాక్షన్ తో ఆయనకి సంబంధం లేదు. వారానికో సినిమా అనౌన్స్ చేస్తారు. ఏడాదికి ఒకటి రెండు సినిమాలు విడుదల చేస్తారు. ఈ మధ్య అవి కూడా తగ్గాయి. అప్పట్లో బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ అనౌన్స్ చేసినప్పుడు తాను కూడా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చేస్తున్నానంటూ వర్మ అనౌన్స్ చేసారు. తరువాత ఏమైందో ఏంటో సైలెంట్ అయ్యారు. అయితే మళ్ళీ చాలా గ్యాప్ తరువాత ఈ నెల 19 న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ముహూర్తం అంటూ హడావుడి మొదలుపెట్టారు. అంతేకాదు తాజాగా ఆయన ట్విట్టర్లో ఓ వీడియో షేర్ చేశారు. అందులో సేమ్ చంద్రబాబులా ఉన్న ఓ వ్యక్తి భోజనం చేస్తున్న వారికి చట్నీ వడ్డిస్తూ కనిపించారు. 'ఈ వ్యక్తి ఎవరో కనిపెట్టేందుకు నాకు ఎవరైనా సహాయం చేస్తారా?.. ఆయన్ను నాకు పరిచయం చేసిన వ్యక్తి ఎవరైనా సరే వారికి రూ.లక్ష బహుమతిగా ఇస్తా. ఆయన ఆచూకీ దొరికితే నా ఈ మెయిల్ Laksmisntr@gmail.com కు వివరాలు పంపండి. మొదట సమాచారం పంపిన వ్యక్తికే రూ.లక్ష అందుతుంది’ అని వర్మ ట్వీట్ చేసారు. దీంతో 'లక్ష్మీస్ ఎన్టీఆర్’లో చంద్రబాబు పాత్ర కోసం వర్మ వీడియోలో ఉన్న వ్యక్తిని వెతుకుతున్నారు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.