'పడ్తాడు మొగవాడు ఎవడైనా' అంటున్న బాలయ్య!
on Dec 11, 2019
"పడ్తాడు తాడు తాడు ఎవడైనా.. మొగవాడు వాడు వాడు ఎవడైనా" అని పాడేసుకున్నాడు నందమూరి బాలకృష్ణ, 'రూలర్' సినిమాలో. కె.ఎస్. రవికుమార్ డైరెక్షన్లో బాలయ్య నటించిన 'రూలర్' సినిమా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్ రిలీజయ్యాయి. 'అడుగడుగో యాక్షన్ హీరో' అనే పాట తర్వాత ఇప్పుడు సెకండ్ లిరికల్ సాంగ్‌ను ఆదిత్యా మ్యూజిక్ సంస్థ యూట్యూబ్‌లో రిలీజ్ చేసింది. మ్యూజిక్ డైరెక్టర్ చిరంతన్ భట్ కూర్చిన బాణీలకు భాస్కరభట రవికుమార్ సాహిత్యం అందించాడు. ఫుల్ మాస్ బీట్తో సాగిన ఈ సాంగ్‌ను సింహా, చాందినీ విజయ్‌కుమార్ షా పాడారు. సముద్ర జలాలపై సాగిపోతున్న షిప్లో బాలకృష్ణ, సోనాల్ చౌహాన్‌పై ఈ పాటను చిత్రీకరించారు. జానీ కొరియోగ్రఫీ అందించాడు. 'ఎర ఎర్రా ఎర ఎర్రా.. నా పెదవుల్ని ముద్దాడుకోరా.. గిర గిర్ర గిర గిర్రా తిరిగేస్తుంటే నను చూడవేరా" అంటూ బాలయ్యకు ఒకవైపు ఆహ్వానం పలుకుతూ, మరోవైపు ఎత్తిపొడిచింది సోనాల్. "హే సర సర సర్రా.. తెగ నచ్చేశావు కుర్రా.. హే జర జర జర్రా.. నా నడుమే జీలకర్ర.. కర్చీఫే ఏస్కో జల్దీ జల్దీగా" అని అతడిని పొగుడుతూ తన నడుమును తనే వర్ణించుకుంది.
"పడ్తాడు తాడు తాడు ఎవడైనా.. మొగవాడు వాడు వాడు ఎవడైనా" అని తన ఆమోదాన్ని ప్రకటించాడు బాలయ్య. ఈ సందర్భంగా బాలయ్య కుర్రాడిగా స్టెప్పులు వేసి ఆశ్చర్యపరిచాడు. "అల్లాద్దిన్కే నేను అందని దీపాన్ని.. నీకోసం వచ్చేశా లుక్కేసుకో.. ఐజాక్ న్యూటన్కే దొరకని యాపిల్ని.. దర్జాగా దొరికేశా పట్టేసుకో" అని తనెంత స్పెషల్ పీసో తెలియజెప్పింది సోనాల్. బాలయ్య ఊరుకుంటాడా! "నువ్వు కెలికితె కెలికితె ఇట్టా.. నా ఉడుకుని దుడుకుని చూపిస్తా.. సరసపు సరుకుల బుట్టా.. నీ బరువును సులువుగ మోసేస్తా" అని తన సత్తా ఏమిటో చెప్పాడు. అంతేనా.. "మిసమిస మెరుపుల పిట్టా.. నీ తహతహ తలుపులు మూసేస్తా.. సొగసరి గడసరి చుట్టా నీ సెగలను పొగలను ఊదేస్తా" అని ఆమెను 'పిట్ట', 'చుట్ట' అని అభివర్ణించాడు.
'షాంపేన్ బాటిలా సొంపుల్ని అందిస్తే.. దిక్కుల్ని చూస్తావే ఎత్తేసుకో" అని ఊరించింది సోనాల్. "వెల్వెట్టు అందాన్ని వాటెయ్యడం కన్నా.. అర్జంటు పనులేంటి ఆపేసుకో" అని ఆర్డరేసింది కూడా. "నీ ఇక ఇక పకపక వల్లా.. నే రకరక రకములు చూపిస్తా.. ఎగరకు ఎగరకు పిల్లా.. నా ఎదిగిన వయసుని పంపిస్తా" అని చురక అంటించాడు బాలయ్య. "నిగనిగ నవరసగుల్లా.. నిను కొరకను కొరకను మింగేస్తా.. కిటకిట కిటుకులు అన్నీ.. నే టకటక లాగేస్తా" అని ఆమెను పొగుడుతూనే తానేం చేస్తాడో చెప్పాడు. దాంతో "రాస్కో పూస్కో ఉండకు ఖాళీగా" అని రెచ్చగొట్టింది సోనాల్. ఆ తర్వాత బాలయ్య ఏం చేసుంటాడో మనం ఊహించుకోవాల్సిందే. మొత్తానికి కుర్రకారుకు కిక్కెక్కించే రీతిలో ఈ పాటను రాశాడు భాస్కరభట్ల.
Also Read