బిగినింగ్ నుంచి ఇంట్రెస్టింగ్గా ఉంటేనే కలెక్షన్లు!
on Oct 15, 2020
సినిమా ప్రారంభం నుంచేఏ జనానికి ఆసక్తి కలిగించేలా ఫోకస్ చేసుకోవాలి. మనం సినిమా బాగా తీస్తేనే జనం చూస్తారు. రివ్యూల్లో ఎంత బాగా రాసినా, మనం ఎంత బాగుందని చెప్పినా, చివరికి సినిమా బాగుంటేనే వర్కవుట్ అవుతుంది.. ఈ మాటలు చెప్పింది ప్రముఖ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్. లాక్డౌన్ తర్వాత థియేటర్లు పునఃప్రారంభం అవుతున్న వేళ.. చిన్న బడ్జెట్ సినిమాల పరిస్థితి ఏమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది.
నిజమే. భరద్వాజ్ మాటలు ప్రతి చిన్న సినిమా నిర్మాతకు, దర్శకుడికి కరదీపిక లాంటివని చెప్పాలి. నాలుగు సార్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి, నాలుగు ప్రెస్మీట్లు పెట్టి, నాలుగు చానళ్లలో కనిపించినంత మాత్రాన డిస్ట్రిబ్యూటర్లు ఎగబడరు, జనం పొలోమని థియేటర్లకు పరుగెత్తుకొని వెళ్లరు. అసలు స్టార్లు లేని సినిమా, క్రౌడ్‌పుల్లర్ లేని సినిమా జనాన్ని ఎందుకు ఆకర్షిస్తుంది? ఆకర్షించేలా ఏం ఉండాలి? అనే ప్రశ్నలు దర్శక నిర్మాతలకు కలిగితే వారు సినిమాపై ఆసక్తిని పెంచేందుకు ప్రయత్నిస్తారు. ఇవాళ చాలామంది చిన్న బడ్జెట్ సినిమాల దర్శక నిర్మాతల్లో కనిపిస్తున్న మనస్తత్వం ఏమిటంటే.. సినిమా స్టార్ట్ చేసి, ఫస్టలుక్, సాంగ్స్, టీజర్స్, ట్రైలర్ రిలీజ్ చేసి, సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటే, చానళ్లలో కనిపిస్తే జనం తమ సినిమా చూడ్డానికి వస్తారని.
స్టార్లు ఉన్న సినిమాలకు పెద్ద పబ్లిసిటీ అవసరం లేదు. వాళ్ల సినిమాలను మోయడానికి ఫ్యాన్స్ ఉంటారు. వద్దన్నా మీడియా పబ్లిసిటీ ఇస్తుంది. సోషల్ మీడియాలో ట్రెండ్స్ వైరల్ అవుతాయి. చిన్న సినిమాలకు ఇలాంటి ఆయుధాలేమీ ఉండవు. కంటెంట్‌ను మాత్రమే నమ్ముకొని వెళ్లాలి. ఆ కంటెంట్‌పై ఆసక్తి రేకెత్తించే మార్కెటింగ్ స్ట్రాటజీ ఫాలో కావాలి. కొంత కాలం క్రితం హృదయ కాలేయం సినిమాకు డైరెక్టర్, ప్రొడ్యూసర్ సాయిరాజేశ్ అనుసరించిన స్ట్రాటజీని గుర్తుకు తెచ్చుకుంటే చాలు. అలా అని కాంట్రవర్సీ కింగ్ అయిన గతకాలపు స్టార్ డైరెక్టర్ అనుసరించే రోత కలిగించే స్ట్రాటజీలోకి దిగితే ఉన్న కాస్త పేరూ ఊడటం ఖాయం.