విజయ్ 'సర్కార్'.. ఓ మెట్టు దిగింది!
on Nov 10, 2018
తమిళనాట 'సర్కార్' సినిమా కేంద్రంగా చెలరేగిన వివాదాలకు, ఆందోళనలకు ఓ విధంగా ముగింపు పడినట్టే! ఓ పక్క ఆందోళనలు.. మరోపక్క దర్శకుడు ఏఆర్ మురుగదాస్ని పోలీసులు అరెస్ట్ చేయవచ్చని గురువారం రాత్రి వెలువడిన వార్తలు.. 'సర్కార్' చిత్రానికి మద్దతుగా రజనీకాంత్, కమల్ హాసన్, విశాల్ వంటి హీరోల ట్వీట్లు... వెరసి శుక్రవారం అంతా తమిళనాట సినిమా పరిశ్రమలో హై డ్రామా నెలకొంది. చివరికి... మాజీ ముఖ్యమంత్రి జయలలితను కించపరిచే విధంగా సినిమాలో సన్నివేశాలు వున్నాయని అన్నాడీఎంకే పార్టీ సభ్యులు చేసిన ఆందోళనలు ఫలించాయి. సినిమాను నిర్మాతలు రీ సెన్సార్ చేయించారు. అభ్యంతరకరమైన సన్నివేశాలను, డైలాగులను తొలగించారు. విజయ్ 'సర్కార్' టీమ్ ఒక మెట్టు దిగడంతో వివాదాలకు ఫుల్ స్టాప్ పడినట్లు అయ్యింది.
సినిమాలో తొలగించిన సన్నివేశాల్లో ప్రముఖంగా చెప్పుకోవలసింది... జయలలిత ఫొటోతో మిక్సీలను తలగలబెట్టే సన్నివేశం! సినిమాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వం పంచిపెట్టిన మిక్సీలు, టీవీలు తగలబెట్టే సన్నివేశం అసలు వివాదానికి కేంద్రబిందువు. జయలలిత ఫొటో వున్న మిక్సీలను విజయ్ కావాలని తగలబెట్టించాడని అన్నాడీఎంకే పార్టీ శ్రేణులు ఆందోళనలు చేశాయి. ఆందోళనలకు ధీటుగా మద్దతు లభించినప్పటికీ.. 'సర్కార్' టీమ్ వివాదాస్పద సన్నివేశాలను తొలగించాలని నిర్ణయించుకుంది.