'క్రాక్'ను దెబ్బకొట్టిన దిల్ రాజు.. నోరు తెరవని రవితేజ!
on Jan 16, 2021
మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వచ్చిన 'క్రాక్' మూవీ 50 శాతం ఆక్యుపెన్సీలోనూ సూపర్బ్ ఓపెనింగ్స్ సాధించింది. నిర్మాత ఠాగూర్ మధు ఆర్థిక ఇబ్బందుల కారణంగా సకాలంలో విడుదల కాకపోయినా, ప్రేక్షకులు ఆ సినిమా కోసం ఓపికగా ఎదురుచూశారు. ఆలస్యంగా థియేటర్లకు వచ్చిన ఆ సినిమాని తమదిగా చేసుకున్నారు. రవితేజను గోపీచంద్ చూపించిన విధానానికీ, రవితేజ చెలరేగిన విధానానికీ నీరాజనాలు పట్టారు. కానీ.. అంతలోనే 13వ తేదీ విజయ్ మూవీ 'మాస్టర్' రిలీజైంది.
ఇక్కడే కాంట్రవర్సీ కూడా చెలరేగింది. నైజాంలోని పలు థియేటర్లలో బ్రహ్మాండంగా ఆడుతున్న 'క్రాక్'ను తీసేసి, 'మాస్టర్'కు థియేటర్లను కేటాయించారు దిల్ రాజు. ఇది వివాదానికి తెరతీసింది. దీన్ని జీర్ణించుకోలేకపోయిన 'క్రాక్' నైజాం డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీనివాస్ బాహాటంగా దిల్ రాజుపై విరుచుకుపడ్డారు. మీడియా సమావేశం పెట్టి మరీ ఆయనపై పలు ఆరోపణలు చేశారు. థియేటర్ల విషయంలో మోనోపలీతో వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. 'క్రాక్' ఆడుతున్న థియేటర్లలో 80 శాతం 'మాస్టర్'కు కేటాయించారనీ, దాంతో 'క్రాక్' సక్సెస్‌ను తాను ఎంజాయ్ చెయ్యలేకపోతున్నాననీ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే తన సినిమా విషయంలో దిల్ రాజు ఇలా వ్యవహరించినా రవితేజ నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎప్పుడూ ఎనర్జిటిక్‌గా కనిపిస్తూ, సాధారణంగా ఎవరైనా తన ముందు డల్‌గా కనిపిస్తే ఇష్టపడని ఆయన, దిల్ రాజు విషయంలో ఆ ఎనర్జీని చూపించడం లేదనీ, డల్‌గా ఉంటున్నారనీ ఇండస్ట్రీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. నైజాంలో తన సినిమాకు సంబంధించిన 80 శాతం థియేటర్లను 'మాస్టర్'కు కేటాయించడంతో, కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడినా కూడా రవితేజ ఎందుకు మౌనంగా ఉంటున్నారో అర్థం కావడం లేదని ఆ వర్గాలు అంటున్నాయి.
గతంలో రవితేజతో రాజు 'భద్ర', 'రాజా ది గ్రేట్' సినిమాలను నిర్మించారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాజును ఆయన ఏమీ అనలేకపోతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో సంక్రాంతి సందర్భంలో విడుదలయ్యే సినిమాల్లో డబ్బింగ్ సినిమాల కంటే స్ట్రయిట్ తెలుగు సినిమాలకే ప్రాధాన్యం ఇవ్వాలని స్వయంగా చెప్పిన దిల్ రాజు.. ఇప్పుడు తన మాటలకు విరుద్ధంగా ఓ డబ్బింగ్ సినిమాకు న్యాయం చేస్తూ, స్ట్రయిట్ సినిమాకు అన్యాయం చేస్తున్నారని వారు గుర్తు చేస్తున్నారు. ఇది రాజు ద్వంద్వ వైఖరికి నిదర్శనంగా వారు పేర్కొంటున్నారు. కాగా 'మాస్టర్' డిస్ట్రిబ్యూటర్స్ అయిన ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ అధినేతలు రాజుకు సన్నిహితులు కావడం వల్లే వారికి ఆయన సపోర్ట్ చేస్తున్నారని అంటున్నారు.
Also Read