రవితేజ, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో 'రాజా 2 గ్రేట్'!
on Oct 18, 2020
రవితేజ, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన 'రాజా ది గ్రేట్' సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించింది. ఫ్లాపుల్లో ఉన్న రవితేజకు ఆ సినిమా ఎంతటి రిలీఫ్ ఇచ్చిందో చెప్పాల్సిన పనిలేదు. ఆ మూవీ విడుదలై నేటికి మూడేళ్లు. ఈ సందర్భంగా ఆ సినిమాని గుర్తు చేసుకుంటూ డైరెక్టర్ అనిల్ రావిపూడితో మరోసారి కలిసి పనిచేయాలనే ఆకాంక్షను వ్యక్తం చేశాడు మాస్ మహారాజా రవితేజ.
ఆదివారం తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా 'రాజా ది గ్రేట్' షూటింగ్ సందర్భంలో ట్రైన్ కంపార్టెమెంట్ పైకెక్కి తనతో పాటు అనిల్ తీసిన సెల్ఫీ పిక్చర్‌ను షేర్ చేశాడు రవితేజ. "మూడు సంవత్సరాల 'రాజా ది గ్రేట్'.. దాని ప్రత్యేకత వల్ల ఆ ఫిల్మ్‌ను ఎప్పుడూ నా హృదయానికి సన్నిహితంగా ఉంచుకుంటాను. రాజా ప్రపంచానికి నన్ను పరిచయం చేసినందుకు థాంక్యూ అనిల్ రావిపూడి. నీతో కలిసి పనిచేయడం చాలా సరదాగా అనిపించింది. మళ్లీ దాని కోసం ఎదురుచూస్తున్నా. #3YearsForRajaTheGreat" అని ఆయన ట్వీట్ చేశాడు.
అనిల్ కూడా రవితేజతో మళ్లీ కలిసి పనిచేసే అవకాశం ఉందనీ, అది 'రాజా 2 గ్రేట్' కావచ్చనీ ఆశాభావం వ్యక్తం చేయడం గమనార్హం. "He is blind...But he is trained !!! రవితేజతో 'రాజా ది గ్రేట్' తీయడం ఎలాంటి మరపురాని అనుభవం!.. థాంక్యూ సర్. ఏదో ఒకరోజు #Raja2Great అవుతుందని ఆశిద్దాం" అని ట్వీట్ చేశాడు. సో.. త్వరలోనే ఆ ఇద్దరి కాంబినేషన్‌లో 'రాజా 2 గ్రేట్' రావచ్చన్న మాట.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
