రవితేజ 'అపరిచితుడు'లా మారితే?
on Sep 8, 2018
విక్రమ్ హీరోగా శంకర్ దర్శకత్వం వహించిన సినిమా 'అపరిచితుడు'. తెలుగులోనూ సినిమా విజయం సాధించింది. రామానుజం... రెమో... అపరిచితుడు... విక్రమ్ మూడు గెటప్పుల్లో కనిపిస్తాడు. కానీ, మనిషి మాత్రం ఒక్కడే! మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ కాన్సెప్ట్‌తో 'అపరిచితుడు' సినిమాను శంకర్ తెరకెక్కించాడు. దర్శకుడు శ్రీను వైట్ల కూడా మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ కాన్సెప్ట్‌తోనే 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమాను తెరకెక్కిస్తున్నాడని ఫిలింనగర్ టాక్.
రవితేజ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలైంది. హిందూ... ముస్లిం... క్రిస్టియన్.. మూడు గెటప్పుల్లో రవితేజ కనిపించాడు. సినిమాలో మూడు గెటప్పుల్లో కనిపించినప్పటికీ మనిషి మాత్రం ఒక్కడేనట! మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ కాన్సెప్ట్‌ని శంకర్ సందేశాత్మక సినిమా తీయడానికి వాడుకుంటే... శ్రీనువైట్ల కొత్తరకం కామెడీ సినిమా తీయడానికి వాడుకుంటున్నాడట! ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అమెరికాలో జరుగుతోంది. ఈ సినిమాతో ఇలియానా తెలుగులోకి రీ ఎంట్రీ ఇవ్వనుంది. అలాగే, ఒకప్పటి హీరోయిన్ లయ కూడా మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. వరుస వైఫల్యాల తరవాత విజయం కోసం శ్రీనువైట్ల కొత్త పంథాలోకి వెళ్లి తెరకెక్కిస్తున్నాడని తెలుస్తోంది.