చిట్టిబాబు న్యూలుక్ అదిరిందబ్బా!
on Dec 9, 2017
పల్లె తరహా పాత్రలు తెలుగు హీరోలు ఎప్పుడో మరిచిపోయారు. ఒకప్పుడైతే..పెల్లెటూరి కుర్రాడి పాత్రల్లో మెరుపులు మెరిపించేవారు. చిరంజీవి ‘కొండవీటి రాజా’లో చేసింది పల్లెటూరి చిన్నోడి పాత్రే. ఇక , బాలయ్య అయితే... మంగమ్మ గారి మనవడు, ముద్దుల కృష్ణయ్య, అల్లరి కృస్ణయ్య, ప్రెసిడెంట్ గారి అబ్బాయ్, బాలగోపాలుడు...ఇలా చెప్పుకుంటే పెద్ద లిస్టే అవుతుంది. నాగార్జున కూడా ‘ప్రెసిడెంట్ గారి పెళ్లాం’లో పెల్లెటూరి చిన్నోడిగా ఇరగదీసేశాడు. ఇక వెంకటేశ్ కి ‘అబ్బాయిగారు’ ఎలాగూ ఉంది. వీరేకాదు.. నాటి హీరోలందరూ గ్రామీణనేపథ్యంలోని పాత్రలు పోషించిన వారే. కానీ... నేటి యంగ్ స్టార్స్ మాత్రం హైదరాబాద్ నీ, వైజాగ్ నీ వదలరు.
వీరి కథలన్నీ ఈ రెండు సిటీల చుట్టూ తిరగాల్సిందే. సిటీ కుర్రాళ్ల కేరక్టర్లే అందరూ పోషిస్తున్నారు. అయితే... ఈ పద్దతికి బ్రేక్ ఇస్తూ... మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తొలి సారి పల్లెటూరి చినోడిగా నటిస్తున్నారు. ఆ సినిమా పేరే ‘రంగస్థలం’. శనివారం ఈ చిత్రానికి సంబంధించిన న్యూలుక్ ని విడుదల చేశారు. పనిలో పనిగా మార్చి 30న సినిమాను విడుదల చేస్తున్నట్లు రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించేశారు. నిజంగా చెప్పుకోవాలి... ఈ లుక్ లో రామ్ చరణ్ అదరహో అనిపించాడు. గళ్ల లుంగీ,, ఎర్ర బనియన్, బొమ్మల చొక్క... గుబురు గడ్డం.. నిజంగా మాస్ పండగ చేసుకునేలా ఉంది చర్రీ గెటప్. 1980 నాటి కథాంశంతో దర్శకుడు సుకుమార్ ఈ చిత్రం తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. నాటి కుర్రాళ్ల ఆహార్యం ప్రతిబింబించేలా ఉంది రామ్ చరణ్ లుక్. అయ్యో... ఇందులో చరణ్ పేరేంటో చెప్పనేలేదు కదూ.. ‘చిట్టి బాబు’. భలే ఉంది కదూ.
సుకుమార్ ఇప్పటిదాకా చేసిన సినిమాలన్నీ క్లాస్ టచ్ తో కూడుకున్నవే. చరణ్ కూడా సిటీ నేపథ్యంలో సాగే మాస్ తరహా పాత్రలు చేశాడు తప్ప పల్లెటూరి పాత్రలు మాత్రం ఇప్పటివరకూ చేయలేదు. ఆ రకంగా ‘రంగస్థలం’ వీరిద్దరికీ కొత్త జానరే. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. అసలు ఈ సిినిమాకు ‘రంగస్థలం’ అనే టైటిల్ ఫైనల్ చేసినప్పట్నుంచీ సినిమాపై ఆసక్తి ఆకాశాన్నంటుతోంది. ఓ విధంగా ‘మగధీర’ తర్వాత ఆ స్థాయిలో చరణ్ సినిమాకై జనాలు ఎదురు చూడ్డం ఇదే. మైత్రీ మూవీస్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సమంత కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. టైటిల్ అదిరింది. ఫస్ట్ లుక్ కూడా అదిరిపోయింది. ఇప్పుడు న్యూలుక్ ఓ రేంజ్ లో ఉంది. నెక్స్ట్ ఆడియో. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలందిస్తున్న ఈ చిత్రం ఆడియో జనవరిలో విడుదల కానుంది. ఇక సినిమా కోసం మార్చి 30 దాకా ఆగాల్సిందే.