English | Telugu

క్షణాల్లో వైరల్ అయిన 'రాములో రాములా..' సాంగ్ టీజర్

on Oct 22, 2019

 

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీ 'అల.. వైకుంఠపురములో' క్రేజ్ మామూలుగా లేదు. ఇప్పటికే 'సామజవరగమన' సాంగ్ యూట్యూబ్‌లో తెలుగు సినిమా రికార్డుల్ని బద్దలు కొట్టగా, లేటెస్టుగా రిలీజ్ చేసిన రెండో సాంగ్ 'రాములో రాములా' టీజర్ నిమిషాల వ్యవధిలోనే లక్షల వ్యూస్ సాధిస్తూ ఆ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో మరోసారి నిరూపిస్తోంది. ఈ మూవీకి తమన్ కూర్చిన స్వరాలు మ్యూజిక్ లవర్స్‌ని ఒక ఊపు ఊపేస్తున్నట్లే కనిపిస్తోంది. నిజానికి మొత్తం పాటలు వచ్చాకే ఈ మాట చెప్పాలి. కానీ ఒక వంటకం రుచిని తెలుసుకోవాలంటే, మొత్తం తినాలా.. శాంపిల్ చూస్తే సరిపోతుందిగా.. అన్నట్లు ఫస్ట్ సాంగ్ 'సామజవరగమన'తోటే 'అల వైకుంఠపురములో' మ్యూజిక్‌ని తమన్ ఏ లెవల్లో కొడుతున్నాడో అర్థమైంది. 

సిరివెన్నెల సీతారామశాస్త్రి ఎంతో చక్కగా రాసిన ఆ పాటని సిద్ శ్రీరాం ఖూనీ చేసి పాడినా, అది బ్లాక్‌బస్టర్ హిట్టవడానికి కారణం.. తమన్ ఇచ్చిన ట్యూన్స్ మహిమే అనేది నిజం. ఆదిత్యా మ్యూజిక్ రిలీజ్ చేసిన ఆ పాటకు 4 కోట్లకు పైగా వ్యూస్, 7 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. ఏ తెలుగు పాటకు సంబంధించి చూసుకున్నా ఇది రికార్డని నిర్మాతలు ప్రకటించారు.

తాజాగా తెలంగాణ జానపద శైలి పాటలు రాయడంలో స్పెషలిస్టయిన కాసర్ల శ్యామ్ రాసిన 'రాములో రాములా నన్నాగం జేసిందో.. రాములో రాములా నా పాణం దీసిందిరో..' అంటూ నడిచే పాటకు సంబంధించిన టీజర్‌ను ఆదిత్యా మ్యూజిక్ మంగళవారం సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు యూట్యూబ్‌లో విడుదల జేసింది. క్షణాల్లోనే సోషల్ మీడియాలో ఈ టీజర్ వైరల్ అయిపోయింది. గంట తిరిగేసరికల్లా దానికి 4 లక్షల 80 వేల వ్యూస్, 60 వేలకు మించి లైక్స్ వచ్చాయంటే.. ఈ సినిమాపై రోజురోజుకూ ప్రేక్షకుల్లో, అభిమానుల్లో పెరుగుతున్న అంచనాలకు నిదర్శనమని చెప్పాలి.

అనురాగ్ కులకర్ణి, మంగ్లీ కలిసి పాడిన ఈ పాట ఫుల్ వెర్షన్‌ను దీపావళి ముందు రోజు.. అంటే అక్టోబర్ 26న రిలీజ్ చేయనున్నారు. టీజర్‌లో కేవలం అనురాగ్ వాయిస్ మాత్రమే వినిపించింది. మంగ్లీ వాయిస్‌ను వినాలంటే 26వ తేదీ దాకా ఆగాలి. తెలంగాణ ఫోక్ స్టైల్‌లో వినిపిస్తున్న ఈ సాంగ్‌ను సినిమాలో ఏదో వేడుక సందర్భంగా చిత్రీకరించినట్లు తెలుస్తోంది. హీరోయిన్ పూజా హెగ్డేని ఉద్దేశించి బన్నీ ఈ పాట పాడుతున్నట్లు ఊహించవచ్చు. అయితే ఆ ఇద్దరితో పాటు టబు, జయరామ్, నివేదా పేతురాజ్, సుశాంత్, మురళీశర్మ సైతం డాన్స్ చేస్తున్నారు. బన్నీ-పూజా, టబు-జయరామ్, సుశాంత్-నివేదా జంటలుగా కనిపిస్తున్నారు. మంచి లైటర్ మూమెంట్‌లో ఈ సాంగ్‌ను అల్లు అర్జున్, పూజా హెగ్డే పాడుతున్నారని తెలుస్తోంది. బహుశా అది సుశాంత్, నివేదా జంటకు సంబంధించిన వేడుక కావచ్చనిపిస్తోంది.

ఒక సాంగ్ టీజర్‌కే ఈ రకమైన పిచ్చిని అభిమానులు చూపిస్తున్నారంటే, రేపు 26న మొత్తం పాట వచ్చాక, దానికి ఎంతటి ఆదరణ లభిస్తుందనేది ఊహాతీతం. వచ్చే సంక్రాంతికి 'అల వైకుంఠపురములో' మూవీ విడుదలవుతోంది. ఈ లోపు తన మ్యూజిక్‌తో ఆ సినిమాకి ఒక ఊపును తీసుకొస్తున్నాడు తమన్. ఇది త్రివిక్రమ్ తో అతనికి రెండో సినిమా. ఇదివరకు 'అరవింద సమేత.. వీరరాఘవ' సినిమాకు ట్యూన్స్ కట్టాడు తమన్. ఆ మూవీ సాంగ్స్ సూపర్ పాపులర్ అవడంతో మరోసారి ఈ సినిమాతో అతనికి ఛాన్స్ ఇచ్చాడు త్రివిక్రమ్. రెండు చేతులా ఆ అవకాశాన్ని ఒడిసిపట్టుకొని సూపర్ ట్యూన్స్‌తో అలరిస్తున్నాడు తమన్. రానున్న రోజుల్లో 'అల వైకుంఠపురంలో' సాంగ్స్ ఏ రీతిన పాపులర్ అయ్యి, సినిమాకి ఏ రేంజ్ క్రేజ్‌ను తీసుకొస్తాయో చూడాలి.


Also ReadLatest NewsCustomer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here