మోడీ చెప్పింది వర్మకు ఇలా అర్థమైంది!
on Apr 6, 2020
అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ, కుక్కపిల్ల.... వెటకారం చేయడానికి రామ్ గోపాల్ వర్మకు అనర్హం. నలుగురు నడిచే దారిలో నడవడం ఆయనకు మహా చెడ్డ చిరాకు. సంథింగ్ స్పెషల్ ఉండేలా, ప్రేక్షకులను ఆకర్షించేలా ఆయన ఏదో పని చేస్తుంటారు. ఆదివారం రాత్రి కూడా అలాగే చేశారు. ప్రధాని నరేంద్రమోడీ అందరినీ లైట్స్ ఆపేసి దీపాలు వెలిగించమని చెప్పారు. కొందరు కొవ్వొత్తులు, ఇంకొందరు జ్యోతులు, మరికొందరు మొబైల్ ఫ్లాష్ లైట్స్, టార్చ్ లైట్స్... ఎవరి సౌకర్యం బట్టి వాళ్లు ఏదో ఒక లిట్ వెలిగించారు.
రామ్ గోపాల్ వర్మ కూడా ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు ఒక లైట్ వెలిగించారు. అది సిగరెట్ లైటర్. అవును... సిగరెట్ లైటర్ ఆన్ చేసి ఆయన ఒక సిగరెట్ అంటించుకున్నారు. సోషల్ మీడియాలో ఆ వీడియో పోస్ట్ చేశారు. మోడీ చెప్పింది వర్మకు అలా అర్థమైందా? అనుకోవడం, ఆశ్చర్యపోవడం ప్రజల వంతైంది. సినిమా సెలబ్రిటీలు అందరూ లైట్స్ ఆర్పేసి దీపాలు వెలిగిస్తే.. వర్మ వెరైటీగా చేశారు. ఆయన చేసిన పని చూసి తిడుతున్న జనాలు కూడా ఉన్నారు.