'మగధీర'తో స్టార్ అయిన చరణ్.. 'ఆర్ఆర్ఆర్'తో మెగాస్టార్ అవుతాడా?
on Nov 28, 2020
'రచ్చ', 'నాయక్' సినిమాల తర్వాత బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తూ, నటించిన 'జంజీర్'తో పాటు, దానికి తెలుగు వెర్షన్‌గా రూపొందిన 'తుఫాన్' డిజాస్టర్ కావడంతో రామ్‌చరణ్ తీవ్ర అసంతృప్తికి గురైన మాట నిజం. అయితే ఆ అసంతృప్తిని మాయం చేస్తూ అతనికి మంచి జోష్‌నిచ్చిన సినిమా 'ఎవడు'. అనివార్య కారణాల వల్ల ఐదు నెలల కాలం విడుదల కాకుండా ఆగిపోయిన ఆ సినిమా 2014 జనవరిలో విడుదలై సంక్రాంతి విజేతగా నిలవడమే కాకుండా, ఆ ఏడాది తొలి హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత 'ధ్రువ', 'రంగస్థలం' చిత్రాలతో మరో రెండు భారీ విజయాలు సాధించాడు చరణ్.
హీరోగా చేసిన 12 సినిమాల్లో ఆరు పెద్ద హిట్లు సాధించడంతో మెగాస్టార్‌కు సరైన వారసుడనే పేరు తెచ్చుకున్నాడు. ఎన్నో అంచనాలతో బోయపాటి శ్రీను డైరెక్షన్లో చేసిన మునుపటి చిత్రం 'వినయ విధేయ రామ' ఫ్లాప్ కావడం నిరాశ కలిగించినా, ప్రస్తుతం చేస్తున్న చిత్రం అతడికి ఎన్నో రెట్ల ఆనందాన్నీ, అనుభూతుల్నీ ఇచ్చే అవకాశం ఉంది. అది.. రాజమౌళి డైరెక్షన్లో చేస్తున్న 'ఆర్ఆర్ఆర్.. రౌద్రం రణం రుధిరం'.
చరణ్‌ను 'మగధీర'తో స్టార్‌ను చేసిన రాజమౌళి, ఈ సినిమాలో అతడిని అల్లూరి సీతారామరాజుగా చూపిస్తున్నారు. ఇప్పటికే తన క్యారెక్టర్ ఇంట్రడక్షన్ టీజర్లో చరణ్ కనిపించిన తీరు అభిమానుల్ని అమితంగా అలరించింది. 'ఆర్ఆర్ఆర్' మూవీలో తన స్నేహితుడు జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి నటిస్తున్నాడు చరణ్. ఈ సినిమాతో చరణ్ ఇమేజ్ మరింత పెరిగి, సరికొత్త మెగాస్టార్‌గా అవతరిస్తాడని అతడి ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
Also Read