మెగా ఫ్యాన్ ఫ్యామిలీకి మెగా పవర్‌స్టార్ రూ. 10 లక్షల విరాళం!
on Feb 9, 2020
నెల రోజుల క్రితం హైదరాబాద్ సిటీ చిరంజీవి యువత అధ్యక్షుడు నూర్ మహ్మద్ గుండెపోటుతో మృతి చెందిన విషయం విదితమే. ఆ వార్త తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి సికింద్రాబాద్‌లోని మహ్మద్ ఇంటికి స్వయంగా వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించి వచ్చారు. అప్పట్లో విదేశాలలో ఉన్న రామ్‌చరణ్ తను హైదరాబాద్ రాగానే నూర్ మహ్మద్ కుటుంబాన్ని కలుస్తానని, ఆ కుటుంబాన్ని ఆదుకుంటానని మాట ఇచ్చారు. తన మాటను నెలబెట్టుకుంటూ ఆదివారం ఉదయం నూర్ మహ్మద్ కుటుంబ సభ్యులను రామ్ చరణ్ ఇంటికి పిలిపించుకొని రూ. 10 లక్షల చెక్కును వారికి అందజేశారు. ఈ సహాయం మరువలేనిదని, ఎన్నటికీ రుణపడి ఉంటామని వారు రామ్‌చరణ్‌తో అన్నారు.
"నూర్ మహ్మద్ మా కుటుంబం పేరుతో చేసిన సేవలు ఎనలేనివి. ముఖ్యంగా ఆయన చేసే కార్యక్రమాలు మేము చూడాలని, మాకు తెలియాలని ఎప్పుడూ కోరుకోకుండా మా పుట్టినరోజులకు, సినిమా ఫంక్షన్లకు అనేక సేవా కార్యక్రమాలు చేశారు" అని చరణ్ గుర్తుచేసుకున్నారు. దాదాపు 45 నిముషాలు ఆయన నూర్ మహ్మద్ కుటుంబంతో గడిపారు. నూర్ మహ్మద్ గారిని తిరిగి తీసుకొని రాలేనని, కానీ మీ ఇంటిలో పెద్ద కొడుకులా మీకు అండగా ఉంటానని వాళ్లతో ఆయన అన్నారు. అదేవిధంగా నూర్ మహ్మద్ కుమారుడికి మంచి ఉద్యోగం ఇప్పిస్తానని, కుమార్తెల పెళ్లిళ్లకు తను వస్తానని ఆ కుటుంబానికి హామీ ఇచ్చారు.
Also Read