English | Telugu

10 రోజులకే బయ్యర్లకు డబ్బులు వచ్చేశాయి!

on Aug 13, 2019

 

"విడుదలైన 10 రోజులకే 'రాక్షసుడు' థియేట్రికల్ రైట్స్ డబ్బులు వచ్చేశాయి. నైజాం, వైజాగ్, ఈస్ట్, వెస్ట్ వంటి పలుచోట్ల భారీ వర్షాలు కలెక్షన్లపై ప్రభావం చూపాయి. అలా మొదటివారం వసూళ్లు కాస్త దెబ్బ తిన్నా, రెండో వారం వసూళ్లు మొదటివారం కంటే అద్భుతంగా ఉన్నాయి" అని చెప్పారు బెల్లంకొండ సురేష్. ఆయన 'రాక్షసుడు' సినిమాని వైజాగ్, తూర్పు గోదావరి ఏరియాల్లో విడుదల చేశారు. ఆ సినిమాకు బ్రేకీవెన్ వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని మంగళవారం ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్లో ప్రింట్ అండ్ మీడియా మీట్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో బెల్లంకొండ సురేష్, 'రాక్షసుడు' హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్, డైరెక్టర్ రమేష్ వర్మ, మల్టీ డైమెన్షన్ వాసు పాల్గొన్నారు.

బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ "'రాక్షసుడు' సినిమా రూ. 22 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. ఆంధ్రా, సీడెడ్, నైజాం ఏరియాల్లో రూ. 12 కోట్లకు అమ్మారు. హిందీ శాటిలైట్ రైట్స్ రూ. 12 కోట్లు, తెలుగు శాటిలైట్ హక్కులు రూ. 5.9 కోట్లు.. వెరసి దాదాపు రూ. 30 కోట్ల బిజినెస్ అయ్యింది. వైజాగ్‌లో రోజు రోజుకీ వసూళ్లు పెరుగుతుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. వైజాగ్, ఈస్ట్ థియేట్రికల్ రైట్స్ నేనే కొన్నాను. 7వ రోజు రూ. 2.5 లక్షల షేర్ మాత్రమే రావడంతో నేను భయపడ్డాను. కానీ 8వ రోజు రూ. 14 లక్షలు, 9వ రోజు రూ. 19 లక్షలు, 10వ రోజు రూ. 25 లక్షలు వచ్చాయి. వైజాగ్ రైట్స్‌ను రూ. 1.35 కోట్లకు కొన్నాను. నిన్నటికే జీఎస్టీతో కలిపి రూ. 2 కోట్లు వచ్చాయి. ఈస్ట్ రైట్స్‌ను రూ. 81 లక్షలకు కొంటే, నిన్నటికే ఆ డబ్బులు వచ్చేశాయి. ఈ సినిమాని కొన్న ప్రతి ఒక్కరూ 10 రోజులకే లాభాల్లో ఉన్నారు. వర్షం కనుక లేకపోయినట్లయితో మొదటివారంలోనే కలెక్షన్ల సునామీ సృష్టించేది.
ఈ సినిమా తమిళ ఒరిజినల్‌కు సైతం మొదటి వారం కంటే రెండో వారం, దానికంటే మూడోవారం ఎక్కువ వసూళ్లు వచ్చాయి. తెలుగులో కూడా అలాగే అద్భుతం సృష్టిస్తుందని నమ్ముతున్నా. దీనిక కారణమైన తెలుగు ప్రేక్షకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. దీనికి ముందు రెండు ఫ్లాప్ సినిమాలు ఉన్నప్పటికీ మా సాయికి 'రాక్షసుడు'తో బ్లాక్‌బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ రమేశ్‌వర్మ, నిర్మాత కోనేరు సత్యనారాయణ, వాళ్లబ్బాయి హవీష్‌కూ రుణపడివుంటాను. ఒక మంచి సినిమాని తెలుగులో మా అబ్బాయికిచ్చి తియ్యడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. ఇవాళ్టి రోజుల్లో రీమేక్ తీసి మెప్పించడం చాలా కష్టమైన పని. కొంతమంది అప్పటికే ఒరిజినల్ చూసి వుంటారు. కచ్చితంగా పోల్చి చూస్తారు. ఆ ఒత్తిడి తట్టుకొని ఒరిజినల్‌కు ఏ మాత్రం తగ్గకుండా అద్భుతంగా తీశారు. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిగా చక్కగా నటించి సాయి తానేమిటో ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పటి దాకా తనకు ఇలాంటి రోల్ పడలేదు. 'అల్లుడు శీను'లో బాగా చేశాడు. 'జయ జానకి నాయిక'లో ఎమోషన్స్ బాగా పండించాడు. 'స్పీడున్నోడు'లో ఫ్రెండ్షిప్‌కి విలువిచ్చే పాత్ర చేశాడు. 'కవచం'లో ఒక పోలీసాఫీసర్ రోల్ చేశాడు. 'సీత'లో తన టాలెంట్ ప్రూవ్ చేసుకొనే కేరెక్టర్ చేశాడు. 'రాక్షసుడు'లో పోలీసాఫీసర్‌గా చేస్తూనే ఫ్యామిలీ కోసం నిలబడే, మేనకోడలంటే ప్రాణమిచ్చే పాత్ర చేశాడు. సరైన టైంలో సాయిశ్రీనివాస్‌కు ఈ సినిమా రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఈ సినిమాకి హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ అనేకంటే కథే హీరో అనడం కరెక్ట్. నేను సాయితో సినిమా తీస్తే 'అల్లుడు శీను'కి మించిన కథ కావాలి. అలాంటి కథ కోసం ఎదురుచూస్తున్నా. పక్కా కమర్షియల్ సినిమా తీస్తా." అని చెప్పారు.

931 థియేటర్లలో రిలీజయింది

మల్టీ డైమెన్షన్ వాసు మాట్లాడుతూ "రాక్షసుడు సినిమా బ్లాక్‌బస్టర్ హిట్. తమిళంలో ఈ సినిమా ఎంత సెన్సేషనో, తెలుగులో అంతకంటే డబుల్ సెన్సేషన్ అయ్యింది. ఆగస్ట్ 2న విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. రెండో రోజుకే సినిమా థ్రిల్లింగ్ బ్లాక్‌బస్టర్ అనేది డిసైడై పోయింది. ఒక థ్రిల్లర్ సినిమాకు టికెట్స్ ఆబ్లిగేషన్ రావడం ఇప్పుడే. ఫస్ట్ వీక్‌లోనే బ్రేకీవెన్ కావాల్సిన సినిమా వర్షాల వల్ల 10 రోజులకి బ్రేకీవెన్ అయింది. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరగడం వల్ల ఇవాళ్టి రోజుల్లో టెబుల్ ప్రాఫిట్ సినిమా తియ్యడం అనేది అరుదైపోయింది. అలాటింది ఈ సినిమా టేబుల్ ప్రాఫిట్‌తో విడుదలై, 10 రోజులకు బయ్యర్స్ అందరికీ లాభాలు అందించే స్థితికి వచ్చింది. ఈ క్రెడిట్ టీం మొత్తానికీ దక్కుతుంది. ముఖ్యంగా హీరో సాయి, డైరెక్టర్ రమేశ్‌వర్మ ఈ సినిమాయే లోకమన్నట్లు ఆరునెల్లపాటు రాత్రీ పగలు కష్టపడ్డారు. వారి కష్టానికి ఫలితాన్ని కలెక్షన్ల రూపంలో ఇచ్చారు ప్రేక్షకులు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 931 థియేటర్లలో రిలీజయింది. 11 రోజులకు రూ. 22.3 కోట్ల గ్రాస్, రూ. 12.2 కోట్ల షేర్ వచ్చింది. బ్రేకీవెన్ వచ్చి, ఈ రోజు నుంచీ కమీషన్లు మొదలవుతున్నాయి. మల్టీప్లెక్సుల్లో మొదటివారం కంటే రెండో వారం ఎక్కువ షేర్ వస్తోంది. తమిళ ఒరిజినల్ మూవీ ట్రెండే ఇక్కడా కనిపిస్తోంది. ఇంకో నాలుగు వారాల రన్ వస్తుందని అంచనా వేస్తున్నాం. సినిమా చూసిన ఎవరూ ఫర్వాలేదని కానీ, బాగుందని కానీ అనడం లేదు.. అదిరిపోయిందంటున్నారు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ వల్లే ఇంత పెద్ద సక్సెస్ అయింది. ఈ సినిమా చేసినందుకు గర్వంగా ఫీలవుతున్నాం" అని చెప్పారు.

ఫ్లాపుల్లో ఉన్నప్పటికీ నమ్మారు

డైరెక్టర్ రమేశ్‌వర్మ మాట్లాడుతూ "విడుదలైనప్పుడు మంచి టాక్ వచ్చినా, నాలుగో రోజు కలెక్షన్లు తక్కువగా వచ్చేసరికి నేను కాస్త భయపడ్డాను. ఆరో రోజు నుంచీ కలెక్షన్లు పెరుగుతూ రావడం, రెండో వారం వచ్చినప్పట్నుంచీ నా ఫ్రెండ్స్ కూడా టికెట్లు దొరకడం లేదనీ, టికెట్స్ కావాలనీ నాకు ఫోన్ చేసి అడుగుతుండటం హ్యాపీగా ఉంది. నేను ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు నన్ను నమ్మి 'రైడ్' డైరెక్టర్‌గా నాకు ఛాన్స్ ఇచ్చారు బెల్లంకొండ సురేశ్. ఇప్పుడు కూడా నేను క్లిష్ట పరిస్థితిలో ఉంటే, మరోసారి నమ్మి సాయిని నాకు అప్పగించారు. ఆయనకు నా కృతజ్ఞతలు. అలాగే.. నేను, సాయి ఫ్లాపుల్లో ఉన్నప్పటికీ మా ఇద్దర్నీ నమ్మి నిర్మాత కోనేరు సత్యనారాయణ గారు ఇంత ఖర్చుపెట్టి ఈ సినిమా నిర్మించారు. ఆయనకు జీవితాంతం రుణపడివుంటాను. సాయిచేత నేను బాగా యాక్టింగ్ చేపించానంటున్నారు. అదేమీ కాదు. సాయిలో చాలా చక్కని నటుడున్నాడు. తను చాలా ఇన్వాల్వయి యాక్ట్ చేశాడు. అనుపమ కూడా బాగా చేసింది" అన్నారు.

ప్రేక్షకాదరణ పొందడం చిన్న విషయం కాదు

బెల్లంకొండ సాయిశ్రీనివాస్ మాట్లాడుతూ "మీడియా వల్లే 'రాక్షసుడు' సినిమా ప్రేక్షకులకు బాగా రీచ్ అయింది. పదో రోజు నుంచీ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ సేఫ్ జోన్‌లోకి వచ్చారంటే చాలా హ్యాపీగా ఉంది. ఈ రోజు కోసమే నేను చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నాను. మా నిర్మాత అయితే విడుదలకు ముందే టేబుల్ ప్రాఫిట్ పొందారు. తమిళ సినిమాకు రీమేక్ అయినా తెలుగువాళ్ల అభిరుచులు, వాళ్ల సెన్సిబిలిటీస్‌ను దృష్టిలో పెట్టుకొని చేశాం. ఒక పెద్ద హిట్ సినిమాని కిల్ చేయకుండా బాగా తియ్యాలని శ్రమించాం. ఏమాత్రం అటుయిటైనా చెడ్డపేరు వస్తుంది. అందుకని చాలా కష్టపడ్డాం. నేను చేసిన అరుణ్ పాత్రను అండర్‌ప్లే చెయ్యాలి. ఇదివరకు 'కవచం'లో కమర్షియల్ కాప్‌గా, టఫ్ పోలీస్‌గా చేశాను. ఇందులో డాన్సులుండవు. మనం రెగ్యులర్‌గా చూసే కమర్షియల్ సినిమా కాదు. అలాంటి సినిమా ప్రేక్షకాదరణ పొందడం చిన్న విషయం కాదు. ఒక పెద్ద కమర్షియల్ సినిమాకు వచ్చినట్లుగా వైజాగ్‌లో రూ. 2 కోట్ల షేర్ వచ్చింది. ఈ సినిమాని చూసినవాళ్లు అప్రిషియేట్ చేస్తున్నారు, మళ్లీ చూడ్డానికి థియేటర్లకు వెళ్తున్నారు. అదొక అచీవ్‌మెంట్‌గా ఫీలవుతున్నాం. ఈ సందర్భంగా నా ఫ్యాన్స్‌కూ, ప్రేక్షకులకూ నా ధన్యవాదాలు" అన్నారు.


Also ReadLatest NewsCustomer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here