సూపర్‌స్టార్ తొలి టీవీ షో దుమ్ము లేపింది!
on Apr 3, 2020
సూపర్‌స్టార్ రజనీకాంత్ తొలిసారి ఒక టెలివిజన్ షోలో కనిపించిన విషయం విదితమే. డిస్కవరీ చానల్ షో అయిన 'ఇన్టు ది వైల్డ్ విత్ బేర్ గ్రిల్స్'లో ఆయన కనిపించిన ఎపిసోడ్ సూపర్‌హిట్ అనిపించుకుంది. అవును. డిస్కవరీ నెట్‌వర్క్‌లోని 12 డిస్కవరీ చానల్స్‌లో ఆ తరహా షోలలో ఈ ఏడాది ఇప్పటివరకూ అత్యధిక రేటింగ్ సాధించిన టీవీ షోగా రజనీకాంత్ పాల్గొన్న షో ప్రీమియర్ నిలిచింది. 4 మిలియన్ ఇంప్రెషన్స్‌తో ఓవరాల్‌గా ఆ తరహా షోలలో రెండో అత్యధిక రేటింగ్ సాధించింది.
రజనీకాంత్‌తో చేసిన 'ఇన్టు ది వైల్డ్ విత్ బేర్ గ్రిల్స్' ఎపిసోడ్ మార్చి 23న ప్రసారమైంది. అన్ని డిస్కవరీ చానల్స్‌లో కలిపి 12.4 మిలియన్ రీచ్ సాధించిన ఈ ఎపిసోడ్.. అదివరకు నాలుగు వారాల ఎపిసోడ్లతో పోలిస్తే 86 శాతం ఎక్కువ రీచ్ సాధించడం విశేషం. అలాగే మునుపటి నాలుగు వారాలతో పోలిస్తే వీక్షకుల సంఖ్య ఆ వారం ఐదు రెట్లు పెరిగింది. సోషల్ మీడియాలో 'తలైవా ఆన్ డిస్కవరీ' అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఈ షో భారీ బజ్‌ను సృష్టించింది. మీడియా మానిటరింగ్ సాఫ్ట్వేర్ సంస్థ 'మెల్ట్‌వాటర్' ప్రకారం 3.32 బిలియన్ల ఇంప్రెషన్స్‌తో 1.41 బిలియన్ల మందికి ఇది రీచ్ అయ్యింది.
ఈ ఏడాది జనవరిలో కర్ణాటకలోని బండీపూర్ టైగర్ రిజర్వ్‌లో హోస్ట్ బేర్ గ్రిల్స్‌తో పాటు ఈ షో షూటింగ్లో రజనీకాంత్ పాల్గొన్నారు. గత ఏడాది ఇదే తరహాలో ప్రధాని నరేంద్ర మోదీతో కూడా బేర్ గ్రిల్స్ ఒక షో చేశారు. దానిని ఉత్తరాఖండ్‌లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్‌లో చిత్రీకరించారు.