కల్కి టీజర్... క్యూరియాసిటీ పెంచింది!
on Apr 10, 2019
'గరుడ వేగ' సినిమా నవంబర్, 2017లో విడుదలైంది. యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కు విజయాన్ని, ఉత్సాహాన్ని అందించింది. చిత్రసీమలో మళ్లీ అతడికి కొత్త బాట వేసింది. ఆ సినిమా తరవాత రాజశేఖర్ ప్రారంభించిన సినిమా 'కల్కి'. 'పీఎస్వీ గరుడ వేగ'కు, ఈ చిత్రానికి మధ్య ఏడాదిన్నర గ్యాప్ కనిపిస్తోంది. "హిట్ వచ్చిన తరవాత రాజశేఖర్ ఎందుకింత గ్యాప్ తీసుకుంటున్నారు? ప్రేక్షకులు 'గరుడ వేగ'ను మర్చిపోయే ప్రమాదం ఉంది. ఇంత గ్యాప్ మంచిది కాదు" అనే కామెంట్స్ పరిశ్రమలో, ప్రేక్షకుల్లో వినిపించాయి. 'కల్కి' టీజర్ తో అటువంటి వ్యాఖ్యలకు సమాధానం లభించినట్టే. భారీ కథను భారీ తారాగణం, భారీ మేకింగ్ తో తెరపైకి తీసుకువస్తున్నట్టు అర్థమవుతోంది. 'అ!' తరవాత ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది.
'కల్కి' టీజర్ లో ఒక్క రాజశేఖర్ ను మాత్రమే కాదు... కథానాయికలు నందితా శ్వేత, అదా శర్మ, ప్రధాన పాత్రల్లో నటిస్తున్న రాహుల్ రవీంద్రన్, సిద్ధూ జొన్నలగడ్డ, అశుతోష్ రాణా, జయప్రకాశ్, చరణ్ తేజ్, శత్రు తదితరులను చూపించారు. విజువల్స్ సూపర్బ్. నేపథ్య సంగీతం కూడా! కథ గురించి క్లూ ఇవ్వకుండా ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచేశాడు ప్రశాంత్ వర్మ. టీజర్ చూస్తుంటే భారీ కమర్షియల్ కథను డీల్ చేస్తున్నట్లుంది. ట్రైలర్ విడుదలైతే క్లారిటీ రావొచ్చు. ఈ వేసవిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.