'రాజ రాజ చోర' టీజర్.. గంగవ్వతో శ్రీవిష్ణు మందు పార్టీ!
on Jun 18, 2021
శ్రీ విష్ణు హీరోగా హసిత్ గోలీ డైరెక్షన్ లో వస్తున్న చిత్రం 'రాజ రాజ చోర'. మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు. ప్రధానమైన పాత్రలను కవర్ చేస్తూ కట్ చేసిన టీజర్ ఆకట్టుకునేలా ఉంది.
టీజర్ ని బట్టి చుస్తే 'రాజ రాజ చోర' పూర్తి కామెడీ జోనర్ లో సాగే సినిమా అని తెలుస్తోంది. టైటిల్ కు తగ్గట్టుగానే దొంగతనాల నేపథ్యంలో వస్తున్న సినిమా అని అర్థమైనప్పటికీ.. టీజర్ కట్ చేసిన విధానం ఆకట్టుకునేలా ఉంది. మొబైల్ లో స్వామి నిత్యానంద స్పీచ్ వీడియో చూస్తూ హీరో దర్శనమిచ్చాడు. హీరో ఓ మురికివాడలో నివాసం ఉంటూ దొంగతనాలు చేస్తుంటాడు. కానీ చాలా స్టైల్ గా తయారైపోయి, తాను సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను అని అబద్దం చెప్తుంటాడు. అలా అబద్ధం చెప్పే హీరోయిన్ కు దగ్గరవుతాడనే విషయం ఈ టీజర్ ను చూస్తే అర్థమవుతోంది. ఇక బిగ్ బాస్ ఫేమ్ గంగవ్వతో కలిసి మందు తాగుతూ శ్రీ విష్ణు చీర్స్ మై ఫ్రెండ్ అంటున్న సీన్ టీజర్లో హైలైట్ అయింది. టీజర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. టీజర్ లో వివేక్ సాగర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంది.
విభిన్న సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీవిష్ణు.. తనకి కలిసొచ్చిన క్రైమ్ కామెడీని మరోసారి నమ్ముకున్నట్లు తెలుస్తుంది. గతంలో 'బ్రోచేవారెవరురా' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ యంగ్ హీరో.. 'రాజ రాజ చోర'తో మరో సక్సెస్ అందుకుంటాడేమో చూడాలి.