రాఘవ లారెన్స్ విరాళం.. 'చంద్రముఖి 2' పారితోషికం!
on Apr 9, 2020
డాన్సర్ నుండి కొరియోగ్రాఫర్ గా... అక్కడి నుండి డైరెక్టర్ గా, హీరోగా ఎదిగిన రాఘవ లారెన్స్ కి సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అభిమాన నటుడితో కలిసి నటించే అవకాశం అతడికి దక్కింది. అదీ అతడికి ఇష్టమైన హారర్ జానర్ లో సినిమా చేసే అవకాశం వచ్చింది. అసలు వివరాల్లోకి వెళితే...
రజనీకాంత్ హీరోగా పి.వాసు దర్శకత్వంలో వచ్చిన 'చంద్రముఖి' తెలుగు, తమిళ భాషల్లో ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ తెరకెక్కుతోంది. ఇందులోనూ రజనీకాంత్ హీరో. దీనికి పి.వాసు డైరెక్టర్. లారెన్స్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నాడు. ఈ సినిమాకి వచ్చిన అడ్వాన్స్ మూడు కోట్ల రూపాయలను అతడు విరాళంగా ఇచ్చాడు.
పీఎం కేర్స్ ఫండ్ కి 50 లక్షల రూపాయలు, తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి 50 లక్షల రూపాయలు, దక్షిణ భారత చలనచిత్ర కార్మికుల సమాఖ్య (పెప్సీ)కి 50 లక్షల రూపాయలు, డాన్సర్స్ యూనియన్ కి 50 లక్షల రూపాయలు, సొంతూరు రోయపురం, దేశీయ నగర్ లో రోజువారీ కార్మికులకు 75 లక్షల రూపాయలు, దివ్యాంగులకు 25 లక్షల రూపాయలు విరాళంగా ఇస్తున్నట్లు రాఘవ లారెన్స్ అని ప్రకటించాడు. రజని సినిమాలో నటించే అవకాశం రావడం వల్ల అతడు ఎంత సంతోషంగా ఉన్నాడో... అతడు ప్రకటించిన విరాళంతో అంతకు పదిరెట్లు ఎక్కువ సంతోషంగా ప్రజలు ఉన్నారు.