English | Telugu

రాగల 24 గంటల్లో మూవీ రివ్యూ

on Nov 22, 2019

నటీనటులు: ఈషా రెబ్బా, సత్యదేవ్, శ్రీరామ్, ముస్కాన్ సేథీ, గణేష్ వెంకట్రామన్, రవివర్మ, కృష్ణభగవాన్ తదితరులు
పాటలు: భాస్కరభట్ల, శ్రీమణి
మాటలు: కృష్ణభగవాన్ 
సినిమాటోగ్రఫీ: 'గరుడవేగ' అంజి
సంగీతం: రఘు కుంచె
నిర్మాత: శ్రీనివాస్ కానూరు
స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీనివాస్ రెడ్డి
విడుదల తేదీ: 22 నవంబర్ 2019

'అదిరిందయ్యా చంద్రం', 'టాటా బిర్లా మధ్యలో లైలా' వంటి వినోదాత్మక చిత్రాలతో విజయాలు అందుకున్న దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి, 'రాగల 24 గంటల్లో' అంటూ తొలిసారి ఓ థ్రిల్లర్ తీశారు. తెలుగమ్మాయి ఈషా రెబ్బా ఓ మహిళా ప్రాధాన్య చిత్రం చేయడమూ ఇదే తొలిసారి. ఈ సినిమా ఎలా ఉంది? రివ్యూ చదివి తెలుసుకోండి. 

కథ:

మోడల్ మేఘన (ముస్కాన్ సేథీ)ని రేప్ చేసి, హత్య చేసిన కేసులో నిందితులు ముగ్గురు జైలు నుండి పారిపోతారు. పోలీసుల నుండి తప్పించుకునే క్రమంలో ఇండియాలో మోస్ట్ ఫేమస్ యాడ్ ఫోటోగ్రాఫర్ రాహుల్ (సత్యదేవ్) ఇంటిలోకి దొంగతనంగా ప్రవేశిస్తారు. అక్కడ రాహుల్ చనిపోయి ఉంటాడు. 'నా భర్తను నేనే హత్య చేశా' అని రాహుల్ భార్య విద్య (ఈషా రెబ్బా) చెబుతుంది. ఆమె ఒక అనాథ. ఏరి కోరి మరీ ఆమెను రాహుల్ పెళ్లి చేసుకుంటాడు. అటువంటి భర్తను విద్య ఎందుకు హత్య చేసింది? అంతకు ముందు విద్య స్నేహితుడు గణేష్ (గణేష్ వెంకట్రామన్)తో రాహుల్ ఎందుకు గొడవపడ్డాడు? అసలు, ఏం జరిగింది? ఈ కేసును ఎసిపి నరసింహ (శ్రీరామ్) ఎలా పరిష్కరించారు? అనేది మిగతా సినిమా. 

ప్లస్ పాయింట్స్:

స్క్రీన్ ప్లే, ట్విస్టులు
సత్యదేవ్ నటన, అతడి క్యారెక్టరైజేషన్ 
ఈషా రెబ్బా
రఘు కుంచె సంగీతం

మైనస్ పాయింట్స్:

శ్రీరామ్ నటన
కథలో కొత్తదనం లేదు
కథలో వేగం తగ్గింది. 
థ్రిల్లింగ్ మూమెంట్స్ లేవు

విశ్లేషణ & నటీనటుల అభినయం: 

మర్డర్ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కిన క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది. దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి ట్విస్టులతో కూడిన స్క్రీన్ ప్లేను బాగా రాశారు. కానీ, కథలో కొత్తదనం లోపించడంతో మెయిన్ ట్విస్ట్స్ కొన్ని రివీల్ అయిన తర్వాత ప్రేక్షకులకు ఏమంత థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉండవు. కానీ, మర్డర్ ఎవరు చేశారనేది చివరి వరకు ప్రేక్షకులు ఊహించలేకుండా మలుపులతో కథను నడిపించిన తీరును మెచ్చుకోవాలి. ఇదే స్క్రీన్ ప్లేకు కొత్తదనంతో కూడిన కథ అయితే ప్రేక్షకులకు కిక్ ఇచ్చేది.

ముఖ్యంగా నటీనటుల్లో సత్యదేవ్ క్యారెక్టరైజేషన్ బావుంది. అతడూ అద్భుతంగా నటించడంతో కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. అతడిపై కోపం వచ్చేలా, విద్య పాత్రలో నటించిన ఈషా రెబ్బాపై సింపతీ వచ్చేలా ప్రథమార్థంలో కొన్ని సన్నివేశాలు భలే పండాయి. ఈషా రెబ్బా స్క్రీన్ ప్రజెన్స్ సినిమాకు హెల్ప్ అవుతుంది. ఆమె నటన కూడా పర్వాలేదు. కానీ, ఈషాకు వేసిన మేకప్ అసలు సెట్ కాలేదు. సినిమాకు అది మైనస్. 

ద్వితీయార్థం వచ్చేసరికి ట్విస్టులు ఆసక్తి కలిగించినా కథలో వేగం లోపించింది. థ్రిల్లర్ సినిమాల్లో సీన్స్ అన్నీ చకచకా పరుగులు తీయాలి. కానీ, నిదానంగా నత్తనడకను కొన్ని సన్నివేశాలు సాగడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి ఆవిరి అయ్యే ప్రమాదం ఉంది. మోడల్ మేఘన హత్యకు గల కారణాలు కానీ, ఫోటోగ్రాఫర్ రాహుల్ హత్యకు గల కారణాలు గానీ ఏమంత షాకింగ్ గా అనిపించవు. రెగ్యులర్ రొటీన్ గా ఉన్నాయి. ఈ కథకు కృష్ణభగవాన్ రాసిన మాటలు సాదాసీదాగా ఉన్నాయి. గుర్తుపెట్టుకునే డైలాగ్ ఒక్కటంటే ఒక్కటీ లేదు. రఘు కుంచె స్వరాల్లో 'నారాయణతే నమో నమో' బావుంది. ఈ పాటకు శ్రీమణి చక్కటి సాహిత్యం అందించారు. రఘు కుంచె నేపథ్య సంగీతం సినిమాకు తగ్గట్టు ఉంది. నిర్మాణ విలువలు సోసోగా ఉన్నాయి. అంజి సినిమాటోగ్రఫీ ఓకే.

సత్యదేవ్, ఈషా రెబ్బా తర్వాత కథలో ప్రాముఖ్యం గల పాత్రను రవి వర్మ చేశాడు. అతడి నటన పాత్రకు తగ్గట్టు ఉంది. గణేష్ వెంకట్రామన్ పాత్ర మూడు సన్నివేశాలకు పరిమితమైంది. మోడల్ గా ముస్కాన్ సేథీ రాంగ్ ఛాయిస్ అనిపిస్తుంది. ఎసిపి పాత్రలో శ్రీరామ్ ఓవర్ యాక్షన్ చేశాడు. అతడి నటనకు తోడు డబ్బింగ్ కూడా బాలేదు. 'టెంపర్' వంశీ, అతడితో పాటు నేరస్థులుగా నటించిన మరో ఇద్దరు పాత్రల పరిధి మేరకు చేశారు;.   

తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్:

'రాగల 24 గంటల్లో' సత్యదేవ్, ఈషా రెబ్బా... ఇద్దరూ అద్భుతమైన నటన కనబరిచారు. ట్విస్టులతో కూడిన చక్కటి స్క్రీన్ ప్లే కూడా కుదిరింది. కానీ, కథలో కొత్తదనం లేదు. కథనంలో వేగం అసలు లేదు. అందువల్ల, తీవ్ర ఉత్కంఠభరితంగా సాగాల్సిన సినిమా సాదాసీదాగా వెళ్ళింది. ఏదో ఓ రెండున్నర గంటలు కాలక్షేపానికి సీరియస్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవారు ఏమాత్రం అంచనాలు పెట్టుకోకుండా వెళితే ఓ మోస్తరుగా సంతృప్తి చెందవచ్చు. అంచనాలు పెట్టుకుంటే నిరాశ తప్పదు.

రేటింగ్: 2.25/5


Cinema GalleriesLatest News


Video-Gossips