స్పెషల్ డేకి రాధేశ్యామ్ టీజర్?
on Jan 16, 2021
రాధేశ్యామ్.. దశాబ్దకాలం తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ ఎంటర్ టైనర్. పాన్ ఇండియా స్టార్ హోదాలో అయితే తనకిదే ఫస్ట్ లవ్ స్టోరీ. బుట్టబొమ్మ పూజా హెగ్డే నాయికగా నటిస్తున్న ఈ పిరియడ్ లవ్ సాగాని జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు. జయరామ్, భాగ్యశ్రీ వంటి ప్రముఖ తారాగణం ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో సందడి చేయనుంది. అలాగే చిత్ర సమర్పకుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు అతిథి పాత్రలో దర్శనమివ్వనున్నారు.
ఇదిలా ఉంటే.. సంక్రాంతికి రాధేశ్యామ్ టీజర్ రాబోతుందంటూ జోరుగా ప్రచారం సాగినా.. టీజర్ అయితే లేదు. ఈ నేపథ్యంలో.. కొత్త కబురు వినిపిస్తోంది. అదేమిటంటే ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు పుట్టినరోజు సందర్భంగా జనవరి 20న రాధేశ్యామ్ టీజర్ ని రిలీజ్ చేసేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తోందట.
ప్రభాస్ పుట్టినరోజు(అక్టోబర్ 23)న బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్ పేరుతో విజువల్ ట్రీట్ ఇచ్చిన యూనిట్.. కృష్ణంరాజు బర్త్ డే స్పెషల్ గా టీజర్ రిలీజ్ చేయబోతున్నారన్నమాట. త్వరలోనే రాధేశ్యామ్ టీజర్ రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చే అవకాశముంది.
కాగా, ఈ వేసవిలోనే రాధేశ్యామ్ వెండితెరపై వెలుగులు పంచనుంది.