హిందీ కోసం తెలుగును వాడుకోను
on Dec 5, 2019
"ఇక్కడ (తెలుగులో) చాలా బిజీగా ఉన్నాను అండీ! సౌత్ సినిమాలకు పెద్ద రీచ్ ఉంటోంది. ఇక, హిందీకి వెళ్లాల్సిన అవసరం ఏముంది? హిందీ ఎందుకు?" అంటోంది రాశీ ఖన్నా. ఈ ఢిల్లీ ముద్దుగుమ్మ చేతి నిండా తెలుగు సినిమాలు ఉన్నాయి. ఈ నెల 13న విడుదలవుతున్న 'వెంకీ మామ'లో నాగచైతన్యకు జోడీగా రాశీ ఖన్నా నటించింది. వారం తర్వాత ఈ నెల 20న సాయి తేజ్ జోడీగా 'ప్రతిరోజూ పండగే'లో కనిపించనుంది. మళ్లీ ఫిబ్రవరిలో ప్రేమికుల రోజున విజయ్ దేవరకొండ సరసన ఓ కథానాయికగా 'వరల్డ్ ఫేమస్ లవర్'లో కనిపించనుంది. సాధారణంగా తెలుగులో స్టార్ట్ స్టేటస్ వచ్చిన తర్వాత హిందీలో ఛాన్సుల కోసం చాలామంది ఉత్తరాది అమ్మాయిలు ప్రయత్నిస్తారు. కానీ, రాశీ ఖన్నా మాత్రం హిందీలో అవకాశాల కోసం తెలుగును వాడుకోనని అంటోంది.
"సౌత్ సినిమాలతో పోలిస్తే బాలీవుడ్ కి బిగ్గర్ రీచ్ ఉందేమో. కానీ, బాలీవుడ్ సినిమాలు చేయడమే నా లక్ష్యం కాదు. బాలీవుడ్ కి వెళ్ళడానికి సౌత్ సినిమాలను వాడుకోవాలని లేదు. హిందీ, కన్నడ, మలయాళం, తెలుగు, తమిళం... ఎక్కడ మంచి పాత్ర దొరికితే అక్కడ చేయాలనేది నా అభిమతం. ఇక్కడ నుండి మెల్లమెల్లగా అక్కడికి వెళ్ళాలని నేను అనుకోవడం లేదు. హిందీ నుండి అవకాశాలు వస్తున్నాయి. అయితే... చాలామంచి పాత్ర వస్తేనే వెళతాను. లేదంటే రెండు పడవల మీద ప్రయాణం చేయను" అని 'వెంకీ మామ' విడుదల సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రాశీ ఖన్నా తెలిపింది.
Also Read