కన్నుకొట్టే అమ్మాయికి మూతి తిప్పుడు నేర్పించిన గంగవ్వ!
on Apr 17, 2021
'మై విలేజ్ షో' యూట్యూబ్ చానల్ ద్వారా కొంతమందికి తెలిసిన గంగవ్వ బిగ్ బాస్ సీజన్ 4 షోతో దాదాపు తెలుగువారందరికీ పరిచితురాలయ్యారు. షోలో తన అమాయకత్వం, ముక్కుసూటి మనస్తత్వంతో హోస్ట్ నాగార్జునతో పాటు వీక్షకులను ఆకట్టుకున్నారు. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా అప్పుడప్పుడూ కనిపిస్తూనే ఉన్నారు గంగవ్వ. ఇటీవల బిగ్ బాస్ తోటి కంటెస్టెంట్ అఖిల్ సార్థక్ ఇంటికి వచ్చి హల్చల్ చేసిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.
లేటెస్ట్గా 'వింక్ గాళ్'గా పేరు పొందిన ప్రియా ప్రకాశ్ వారియర్‌కు ఎలా మూతి తిప్పాలో నేర్పించింది గంగవ్వ. మలయాళం మూవీ 'ఒరు అడార్ లవ్' మూవీ టీజర్లో కన్నుకొట్టిన సీన్‌తో దేశాన్నంతా ప్రేమలో పడేసిన ప్రియా ప్రకాశ్ ఇటీవల నితిన్‌తో నటించిన 'చెక్' మూవీతో నేరుగా టాలీవుడ్ ఆడియెన్స్‌కు పరిచయమైంది. ఆమె తాజా సినిమా 'ఇష్క్' ఈ నెల 23న విడుదల కాబోతోంది. అందులో తేజ సజ్జా హీరో.
ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా గంగవ్వను కలిసింది ప్రియ. "కన్నుకొట్టుడు కాదు, మూతితిప్పుడు" అని చకచకా మూతి తిప్పి ప్రియకు సవాల్ విసిరారు గంగవ్వ. ఆమె భుజం మీద చేయివేసి ప్రియ కూడా తన మూతి తిప్పింది కానీ గంగవ్వ అంత వేగంగా తిప్పలేకపోయింది. అయినప్పటికీ ఆమె మూతి తిప్పుడు ముద్దుగానే ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు ఆన్లైన్లో వైరల్‌గా మారింది.