ప్రభాస్.. ద ఫస్ట్ అండ్ ఓన్లీ పాన్ ఇండియా సూపర్ స్టార్!
on Oct 23, 2019
'బాహుబలి' సినిమాకి ముందు ప్రభాస్.. టాలీవుడ్లో ఒక స్టార్ హీరో మాత్రమే. పవన్ కల్యాణ్, మహేశ్, జూనియర్ ఎన్టీఆర్ పేర్ల తర్వాతే అతని పేరు ఉండేది. కానీ యస్.యస్. రాజమౌళి ఏ ముహూర్తాన 'బాహుబలి'గా ప్రభాస్‌ను ఊహించుకున్నాడో, అ క్షణాన ప్రభాస్ దశ తిరిగింది. అంది వచ్చిన అవకాశాన్ని ఒడిసిపట్టుకొని, వేరే ధ్యాస లేకుండా 'బాహుబలి'గా విశ్వరూపమే ప్రదర్శించాడు ప్రభాస్. ఆ మూవీతో దేశవ్యాప్తంగా.. ఆ మాటకొస్తే ప్రపంచవ్యాప్తంగా అభిమాన సందోహాన్ని సంపాదించుకున్నాడు.
ఒక తెలుగు నటుడికి దేశవ్యాప్తంగా ఫ్యాన్ బేస్ రావడం ఇదివరకు మనమెన్నడూ చూడలేదు. 'బాహుబలి: ద బిగినింగ్' వేసిన ఫౌండేషన్‌తో 'బాహుబలి: ద కంక్లూజన్'తో మరింత రెచ్చిపోయాడు ప్రభాస్. ఇక ఆ సినిమాతో ప్రేక్షకులు వెర్రెత్తిపోయారు. ప్రభాస్ మేనియాతో ఊగిపోయారు. ఆరడుగుల విగ్రహం వుండేవాళ్లు చాలామందే ఉంటారు. దానికి గ్లామరస్ లుక్ కూడా తోడైతే.. ఒక హీరో ఎలా ఉంటాడనేందుకు ట్రూ ఎగ్జాంపుల్‌గా నిలిచాడు ప్రభాస్. 'బాహుబలి 2' మూవీ వసూళ్ల సునామీతో అదివరకటి హిందీ సినిమాల రికార్డుల్ని కూడా తుడిచిపెట్టేసి సరికొత్త రికార్డులు సృష్టించడం నిజంగా ఒక ఫినామినా.
టాలీవుడ్లో ఎంతమంది మహా మహా స్టార్లు ఉండనీ గాక.. వాళ్లెవరూ చెయ్యలేని పని ప్రభాస్ చేశాడు. అది.. బాలీవుడ్లో సవాలే లేకుండా సాగుతున్న ఖాన్ త్రయం హవాని నిలువరించడం! వాళ్ల అధిపత్యానికి గండికొట్టాడు ప్రభాస్. సౌత్ ఇండియాలోనే సూపర్ స్టార్‌గా వెలుగొందుతున్న రజనీకాంత్‌కు కూడా సాధ్యం కాని ఫీట్‌ను ప్రభాస్ సాధించాడు. గతంలో హిందీలో రజనీకాంత్, కమల్ హాసన్ కొన్ని సినిమాలు చేశారు. తెలుగు నటుల విషయానికొస్తే.. చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్.. బాలీవుడ్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కానీ అక్కడ వాళ్లెవరూ స్టార్లు కాలేకపోయారు. కానీ అప్పటిదాకా ఎవరి ఊహకు కూడా అందని ప్రభాస్.. ఆ ఘనతను సాధించాడు. అందరు స్టార్లూ అసూయపడేంత కీర్తి సంపాదించాడు.
'బాహుబలి' సినిమాలు సృష్టించిన ప్రభంజనం ఘనతను చాలామంది రాజమౌళికే ఆపాదించి, ప్రభాస్ ప్లేస్‌లో ఎవరున్నా ఆ సినిమాలు ఆ రికార్డుల్ని సాధించేవేనని అతన్ని తక్కువచేసి మాట్లాడటం మనకు తెలుసు. కానీ వాళ్లది తప్పుడు అభిప్రాయమని 'సాహో'తో నిరూపించాడు ప్రభాస్. ఆ సినిమా డైరెక్టర్ సుజిత్ ఎవరో తెలుగు ప్రేక్షకులకే సరిగా తెలీదు. దేశంలోని మిగతా సినీ ప్రియులకైతే పరిచయమే లేదు. 'సాహో' మూవీతోటే సుజిత్ ఎవరో ప్రపంచానికి తెలిసింది. 'సాహో' తెలుగునాట ఆశించిన రీతిలో ఆడలేదు. బయ్యర్లు నష్టపోయారు.
కానీ నార్త్ బెల్ట్‌లో 'సాహో' చేసిన వీరవిహారం చూసి బాలీవుడ్ స్టార్లు కళ్లు తేలేశారు.. తరణ్ ఆదర్శ్ లాంటి పేరుపొందిన బాలీవుడ్ విశ్లేషకుడు 'అన్బేరబుల్' అంటూ 1.5 స్టార్ రేటింగ్ ఇచ్చి 'సాహో'ను దారుణంగా విమర్శించాడు. అలాంటివాడు 'సాహో' హిందీ వెర్షన్ సూపర్ హిట్టవడం చూసి బిత్తరపోయాడు. క్రిటిక్స్ అంతా చెత్త అని తేల్చేసిన 'సాహో'.. హిందీ వెర్షన్ కేవలం 5 రోజుల్లోనే ఇండియాలో 100 కోట్ల రూపాయల్నీ, ఓవరాల్‌గా 142 కోట్ల రూపాయల్నీ రాబట్టి ప్రభాస్ ఇమేజ్ ఏ రేంజిలో ఉందో చాటి చెప్పింది.
అప్పటిదాకా 'సాహో'ను విమర్శించినవాళ్లే, 'ప్రభాస్ పాన్ ఇండియా సూపర్ స్టార్' అని ప్రశంసల జల్లు కురిపించారు. నిజమే. రిలీజ్‌కి ముందు 'సాహో'లో పెద్ద కథేమీ లేదని స్వయంగా ప్రభాసే చెప్పాడు. యాక్షన్ ఎపిసోడ్స్ గొప్పగా ఉంటాయని చెప్పాడు. కానీ ఆడియెన్స్ 'సాహో'ను చూసింది కథ కోసమూ కాదు, యాక్షన్ ఎపిసోడ్స్ కోసమూ కాదు.. కేవలం ప్రభాస్ కోసం! యస్.. ప్రభాస్‌ని చూడాలనే తహతహతోటే నార్త్ ఇండియాలోని మారుమూల ప్రాంతాల ప్రేక్షకులు 'సాహో' ఆడుతున్న థియేటర్లను హౌస్‌ఫుల్ చేశారు.
'సాహో' తెలుగునాట చెప్పుకోదగ్గ వసూళ్లను సాధించకపోవచ్చు గాక.. కానీ ఒక విషయాన్ని మాత్రం స్పష్టం చేసింది.. 'బాహుబలి' రెండు సినిమాలు సాధించిన రికార్డుల్లో రాజమౌళితో పాటు, ప్రభాస్‌కూ క్రెడిట్ ఇవ్వాల్సిందేనని. 'సాహో'కు వచ్చిన క్రేజ్, హిందీలో ఆ సినిమా సాధించిన కలెక్షన్‌తో అసలు సిసలు పాన్ ఇండియా సూపర్ స్టార్‌గా రూపాంతరం చెందాడు ప్రభాస్. ప్రస్తుతం ఏ బాలీవుడ్ స్టార్ కూడా పాన్ ఇండియా స్టార్ కాదు.
సల్మాన్ ఖాన్, ఆమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్, టైగర్ ష్రాఫ్ వంటి బాలీవుడ్ స్టార్లు.. సౌత్ ఇండియాలో స్టార్లు కారు. ఆ విషయం ఇటీవలి 'వార్' మూవీతో తేటతెల్లమైంది. బాక్సాఫీస్ దగ్గర 'వార్' మూవీ బ్లాక్‌బస్టర్ హిట్టయింది. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్ మూవీగా రికార్డులు సృష్టించింది. ఇద్దరు టాప్ యాక్షన్ స్టార్లు హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్.. అందులో నటించారు. కానీ ఆ మూవీ తెలుగు వెర్షన్ ఆరేడు కోట్ల రూపాయలని మించి వసూలు చేయలేకపోయింది.
తాజాగా 'వార్' సినిమాకు సీక్వెల్‌ని ప్లాన్ చేస్తున్నారనీ, అందులో ప్రభాస్‌ను ఓ హీరోగా నటింపజేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయనీ ప్రచారంలోకి వచ్చింది. కారణం.. హృతిక్‌తో పాటు ప్రభాస్ కూడా నటిస్తే.. ఆ సినిమా రేంజి.. వేరే లెవల్లో ఉంటుందనేది నిర్మాతల ఆలోచన అని చెప్పుకుంటున్నారు. ప్రభాస్ ఆ సినిమా చేస్తే, తెలుగునాటే కాకుండా దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ వస్తుందనీ, అది కలెక్షన్ల సునామీని సృష్టిస్తుందనీ నిర్మాతలు భావిస్తున్నట్లు బాలీవుడ్ వర్గాల మాట. అందులో నిజం ఉండనీ, లేకపోనీ.. ప్రభాస్ రేంజి ఏ లెవల్‌కు వెళ్లిందో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అందుకే.. ఇవాళ.. ప్రభాస్. ద ఫస్ట్ అండ్ వన్ అండ్ ఓన్లీ పాన్ ఇండియా సూపర్ స్టార్! భవిష్యత్తులో కెరీర్ పరంగా అతను మరెన్నో ఉన్నత శిఖరాలు అందుకుంటాడని ఆశిద్దాం. విషింగ్ ఎ వెరీ హ్యాపీ బర్త్‌డే టు ప్రభాస్!
(అక్టోబర్ 23 ప్రభాస్ పుట్టినరోజు)
- యజ్ఞమూర్తి