ప్రభాస్20... 'రాధేశ్యామ్' ఫస్ట్ లుక్ వచ్చిందోచ్!
on Jul 10, 2020
ఆరడుగుల అందగాడు ప్రభాస్. నయా అతిలోక సుందరి పూజా హెగ్డే. వీళ్లిద్దరూ జంటగా తెరపైకి వస్తే ఎలా ఉంటుంది? అదీ అందమైన యూరప్ నేపథ్యంలో ప్రేమకథా చిత్రంలో నటిస్తే ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నలకు జవాబు ఈ రోజు లభించింది. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న సినిమా ఫస్ట్ లుక్ శుక్రవారం (జూలై 10) ఉదయం పది గంటలకు విడుదలైంది. 'బాహుబలి 1' విడుదలై ఐదేళ్లు అయిన సందర్భంగా అభిమానులకు ప్రభాస్ 20 టీమ్ ఇచ్చిన కానుక ఇదే అనుకోవాలి.
ఏమాటకు ఆ మాటే చెప్పుకోవాలి. ఓ సుమధుర దృశ్యకావ్యాన్ని ఫస్ట్ లుక్ తలపించింది. ఓ అందమైన పెయింటింగ్ చూసినట్టు ఉంది. హీరో హీరోయిన్ల జోడీ కూడా చాలా బావుంది.
ఫస్ట్ లుక్తో పాటు టైటిల్ కూడా ప్రకటించారు. ఈ చిత్రానికి 'రాధే శ్యామ్' టైటిల్ ఖరారు చేశారని కొన్నాళ్ల క్రితమే బయటకొచ్చింది. అది అభిమానులకూ నచ్చింది. అదే టైటిల్ ఈ రోజు కన్ఫర్మ్ చేశారు. ఇంతకు ముందు ఈ సినిమాకు 'జాన్' టైటిల్ అనుకున్నారు. శర్వానంద్, సమంత జంటగా నటించిన తమిళ హిట్ '96'కి రీమేక్ కి నిర్మాత దిల్ రాజు 'జాను' టైటిల్ పెట్టడంతో ప్రభాస్ టీమ్ మరో టైటిల్ చూసింది. ఇప్పుడీ ఫస్ట్ లుక్ చూస్తుంటే 'జాన్' కంటే 'రాధే శ్యామ్' బాగా సూట్ అయినట్టు అనిపిస్తోంది.
'రాధే శ్యామ్'లో ప్రభాస్ కొత్త హెయిర్ స్టయిల్ ట్రై చేసినట్టు కనిపిస్తోంది. హీరో హీరోయిన్ కింద ఎగసిపడుతున్న అలలు, ఎర్రటి నేపథ్యం సినిమాపై క్యూరియాసిటీ కలిగిస్తున్నాయి.
ఈ ఫస్ట్ లుక్ విడుదలతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెర పడింది. ఎప్పటి నుండో వాళ్లు ఈ లుక్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూశారు. ఒకానొక దశలో నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రభాస్ అభిమానులు హ్యాపీ.