పవన్ కల్యాణ్ 'పింక్' రీమేక్ రిలీజ్ డేట్ వెల్లడైంది
on Feb 3, 2020
పవన్ కల్యాణ్ కీలక పాత్రధారిగా రూపొందుతోన్న 'పింక్' రీమేక్ విడుదల తేదీ తెలిసింది. మే 15న ఈ మూవీని రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాత దిల్ రాజు తెలిపారు. శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఈ మూవీలో లైంగిక హింసకు గురైన ముగ్గురు అమ్మాయిల తరపున వాదించే వకీలుగా పవన్ కనిపించనున్నారు. ఇప్పటికే వారం రోజుల పాటు షూటింగ్లో ఆయన పాల్గొన్నారు. మరో రెండు వారాలు ఈ సినిమా కోసం ఆయన కేటాయించారు.
సినిమా టైటిల్‌ను ఉగాది సందర్భంగా మార్చి 25న ప్రకటించనున్నట్లు దిల్ రాజు చెప్పారు. అయితే ఇప్పటికే 'వకీల్ సాబ్' అనే టైటిల్‌ను రిజిస్టర్ చేసిన విషయం ప్రస్తావించగా, ఆయన నవ్వుతూ దాటవేశారు. అధికారికంగా ఉగాదికి టైటిల్ అనౌన్స్ చేస్తామన్నారు. 'పింక్' మూవీని పలు మార్పులతో, పవన్ కల్యాణ్ ఇమేజ్ను దృష్టిలో పెట్టుకొని రూపొందిస్తున్నట్లు రాజు తెలిపారు. "ఏం మార్పులు చేశామో మే 15న సినిమా విడుదల రోజు చూడండి" అని ఆయన చెప్పారు. పవన్ కల్యాణ్‌తో సినిమా తియ్యడం తన కల అనీ, ఈ సినిమాతో ఆ కల నెరవేరుతున్నందుకు ఆనందంగా ఉందనీ ఆయన అన్నారు.