పవన్‌కల్యాణ్ పేరు లేకుండా....
on Dec 13, 2019
సినిమాలు సినిమాలే! రాజకీయాలు రాజకీయాలే! రాజకీయాల్లో వైఫల్యాలు వచ్చినా సినిమా నటీనటులకు ప్రజల్లో ఉండే క్రేజ్ ఏమాత్రం తగ్గదని, చెక్కుచెదరదని చెప్పడానికి గతంలో చాలా ఉదాహరణలు ఉన్నాయి. రాజకీయాల్లో వైఫల్యాలు పక్కనపెట్టి, సినిమాల్లో సక్సెస్ కొట్టిన హీరోలు ఈ దేశంలో ఉన్నారు. రాజకీయాల్లో పవన్‌కల్యాణ్ ప్రస్తుత స్థితిగతులు ఎలా ఉన్నాయనేది పక్కనపెడితే... ఆయన్ను అభిమానించే ప్రేక్షకులు సంఖ్య తక్కువేమీ కాదు. అటువంటి పవన్‌కల్యాణ్ రీఎంట్రీ సినిమా ప్రకటనలో ఆయన పేరు లేకపోవడం ఆశ్చర్యమే.
తెలుగులో హిందీ హిట్ ‘పింక్’ను అతిలోక సుందరి శ్రీదేవి భర్త బోనీ కపూర్‌తో కలిసి ప్రముఖ తెలుగు నిర్మాత దిల్ రాజు రీమేక్ చేస్తున్నారు. ‘ఓ మై ఫ్రెండ్’, ‘ఎంసీఏ’కు దర్శకత్వం వహించిన వేణు శ్రీరామ్, ఈ సినిమాకు దర్శకుడు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నాడు. మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ విషయాన్ని ప్రొడక్షన్ హౌస్ ట్వీట్ చేసింది. అందులో ఎక్కడా పవన్‌కల్యాణ్ పేరు ప్రస్తావించలేదు. సినిమా యూనిట్ ఎవరూ పవర్‌స్టార్ ప్రస్తావన లేకుండా జాగ్రత్త పడ్డారు. ప్రస్తుతం పవన్‌కల్యాణ్ రాజకీయ సభలతో బిజీగా ఉండడమే అందుకు కారణమని సమాచారం. హిందీలో అమితాబ్ చేసిన పాత్రను తెలుగులో పవన్ చేయనున్నారు. తాప్సీ పాత్రను నివేదా థామస్, మరో పాత్రలో అంజలి నటించనున్నారు. జనవరిలో షూటింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారట.