'పెళ్లి సందD'తో శ్రీకాంత్ కొడుకు రోషన్ చరిత్ర సృష్టిస్తాడా?
on Oct 26, 2020
శ్రీకాంత్ కెరీర్‌ను సమూలంగా మార్చేసిన సినిమా 'పెళ్లి సందడి'. కె. రాఘవేంద్రరావు మేధస్సు నుంచి తక్కువ బడ్జెట్‌తో తయారైన ఆ సినిమా పదింతలు పైగా వసూళ్లను ఆర్జించి, చిన్న సినిమాల్లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నమోదైంది. రవళి, దీప్తి భట్నాగర్ హీరోయిన్లుగా నటించిన ఆ సినిమాకి కీరవాణి స్వరాలు కూర్చిన పాటలు ఒక ప్రభంజనమే సృష్టించాయి. ఆ సినిమా 1996లో వచ్చింది.
ఇప్పుడు తరం మారింది. శ్రీకాంత్ కొడుకు రోషన్ ఇప్పటికే 'నిర్మల కాన్వెంట్' (2017) సినిమాతో టీనేజ్ స్టార్‌గా వచ్చాడు. ఇప్పుడు తండ్రి చేసిన 'పెళ్లి సందడి'కి సీక్వెల్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఆ సినిమా వచ్చిన 25 ఏళ్లకు.. అంటే 2021లో కొత్త 'పెళ్లి సందD' రానున్నది. ఇది నిజంగా ఒక అరుదైన విషయమే. గౌరి రోణంకి డైరెక్ట్ చేసే ఈ సినిమాకు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షకునిగా వ్యవహరించనుండటం గమనార్హం.
రాఘవేంద్రరావు సోదరుడు కె. కృష్ణమోహనరావు, ఆర్కా మీడియా వర్క్స్ సంయుక్తంగా నిర్మించే ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానున్నది. హీరోయిన్(లు), ఇతర తారాగణం, టెక్నీషియన్ల బృందాన్ని త్వరలో ప్రకటించనున్నారు. అలనాటి 'పెళ్లి సందడి'తో తండ్రి సాధించిన అసాధారణ విజయాన్ని 'పెళ్లి సందD' శ్రీకాంత్ కొడుకు రోషన్ సాధిస్తాడా? చూడాలి.