‘ఆ కథ నాదే‘.. ఫ్రెంచ్ డైరెక్టర్ ట్వీట్!
on Jan 3, 2018
ప్రపంచం చాలా చిన్నదైపోయింది. ఏ చిన్న తప్పు జరిగినా ప్రపంచం మొత్తం తెలిసిపోతున్న రోజులివి. ఒకప్పుడు మన సినిమా వాళ్లు పరాయి భాషా సినిమాలు కాపీ కొట్టినా అవి.. మాతృక తీసిన వారికి తెలిసేది కాదు. ఇప్పటి పరిస్థితి అలా లేదు. సోషల్ మీడియా పుణ్యమా అని... అందరికీ ఆ విషయం తెలిసిపోతోంది.
పవర్ స్టార్ ‘అజ్ఙాతవాసి’ సినిమా విషయంలో అదే జరిగింది. ఫ్రెంచి సినిమా ‘లార్గోవించ్’కి అజ్ఙాతవాసి’ కాపీ అని జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో... ఈ విషయం నేరుగా ‘లార్గోవించ్’ సినిమా తీసిన ఫ్రెంచ్ దర్శకుడు జెరొమ్ సల్లే చెవిలోనే పడింది. దీంతో ఆయన ట్విటర్ లో తన స్పందనను తెలియజేశాడు. ’ఓ తెలుగు సినిమా నా మూవీనికి కాపీగా రాబోతోందట. నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. అందుకే... ‘అజ్ఙాతవాసి’ టికెట్ కొనాలనుకుంటున్నాను’ అని కామెంట్ పెట్టాడు.
ఇంగ్లిష్, ఫ్రెంచ్..చైనా.. ఇలా వేరే దేశాలకు సంబంధించిన సినిమాలు కాపీ కొట్టడం మనోళ్లకు కొత్తేం కాదు. అయితే... ఇలాంటి పరిణామం మాత్రం మనోళ్లకు ఎప్పుడూ ఎదురవ్వలేదు. తెలుగు అనేది భారతదేశంలోనే ఓ ప్రాంతీయ భాష అవ్వడంతో.. మన ఆగడాలు వారికి తెలీని పరిస్థితి. కానీ... ఇప్పుడు మన సినిమా స్పేన్ కూడా పెరిగిపోవడంతో... మనోళ్లు వేసే వేషాలు వారికి కూడా తెలిసిపోతున్నాయ్?
పైగా ఆ ఫ్రెంచ్ సినిమా హక్కుల్ని టి సిరీస్ వాళ్లు కొనుక్కొని ఉన్నారు. ఇప్పుడు ఆ సినిమా డైరెక్టర్ గారేమో.. ట్వీట్టర్ ఎక్కాడు. ఈ సినిమా ఈ నెల 10న రాబోతోంది. మరి ఈ గొడవ ఎలా సద్దుమణుగుతుందో చూడాలి.
ఇందు మూలంగా యావన్మంది దర్శకులకూ మేం చెప్పేదేంటంటే... కొత్తగా ఆలోచించడం నేర్చుకోండి నాయనా!