ENGLISH | TELUGU  

తెలుగును రక్షించుకోవాలంటూ ఇంగ్లీష్‌లో ట్వీట్స్: ట్రోల్స్‌కు గురైన పవర్‌స్టార్!

on Nov 12, 2019

 

ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఏడాది నుంచి ప్రాథమిక విద్యా స్థాయిలో పూర్తిగా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొన్ని ఉపాధ్యాయ సంఘాలతో పాటు అనేకమంది వ్యతిరేకించారు. జనసేనాని పవన్ కల్యాణ్ అయితే మరింతగా ఫైర్ అవుతున్నారు.  నవంబర్ 10 నుంచి ఒక దాని తర్వాత ఒకటిగా ఆయన వైసీపీ నిర్ణయాన్ని ఎండగడుతూ ట్వీట్స్ చేస్తూ వస్తున్నారు. అయితే వాటిలో ఎక్కువ ట్వీట్స్ ఇంగ్లీష్‌లో ఉండటంతో అవి ట్రోల్స్‌కు గురవుతుండటం గమనార్హం. 'పెద్ద బాలశిక్ష', 'తెలుగు వ్యాకరణము' గ్రంథాల ముఖచిత్రాలను జోడించి ఆయన "The recent decision of YCP led AP Govt’s policy of ‘Banning Telugu medium in Govt schools’ made me look at ‘telugu books’ in my library with a great admiration, love and care." అంటూ ఇంగ్లీషులో చేసిన ట్వీట్‌తో ఆయన వైసీపీ ప్రభుత్వంపై ట్వీట్ల యుద్ధం మొదలుపెట్టారు.

ఆ తర్వాత తన సొంత లైబ్రరీలో ఉన్న ఆణిముత్యాలనదగ్గ తెలుగు పుస్తకాలను ఒకదాని తర్వాత ఒకటిగా ఉటంకిస్తూ వచ్చారు. వాటిలో 'ఆంధ్రుల సాంఘిక చరిత్ర', 'శివారెడ్డి కవిత', 'శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు', 'సమగ్ర ఆంధ్ర సాహిత్యం', 'దేవరకొండ బాలగంగాధర తిలక్ లభ్య రచనల సంకలనం' వంటి పుస్తకాలున్నాయి.  భాషా సంస్కృతుల్ని ఎలా కాపాడుకోవాలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను చూసి నేర్చుకోవాలని వైసీపీ నాయకత్వానికి ఆయన సూచించారు. ఈ సందర్భంగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ పబ్లిష్ చేసిన 442 కవుల కవితా సంకలనం 'తొలిపొద్దు'ను ప్రదర్శించారు. దీన్ని కూడా ఆయన ఇంగ్లీష్‌లోనే ట్వీట్ చేశారు. ఈనాడు దినపత్రికలో ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు రాసిన 'అందరికోసం అమ్మభాష' వ్యాసాన్ని పోస్ట్ చేసి, దాన్ని ఇంగ్లీషులో పొగిడారు. ఆ వ్యాసం చూసి వైసీపీ గవర్నమెంట్ కళ్లు తెరుచుకోవాలని సలహా ఇచ్చారు.

అలాగే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ నాయకత్వం.. అప్పటి టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని విమర్శిస్తూ, తెలుగును కాపాడాలంటూ చేసిన ప్రకటనలను, వైఎస్ జగన్ పత్రిక 'సాక్షి'లో రాసిన వార్తా కథనాలను ఆయన తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేసి, వైసీపీది రెండు నాల్కల ధోరణిగా అభివర్ణించారు. అందులో వైఎస్ జగన్ చేసిన 'దేశభాషలందు తెలుగు లెస్స. మాతృభాష మన ప్రాచీన సంపద. కాపాడుకుందాం, పెంపొందిద్దాం. తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు' అనే ట్వీట్‌ను కూడా పవన్ కల్యాణ్ పోస్ట్ చేశారు. నాయకులు, విద్యావంతులు వ్యక్తం చేసే అభిప్రాయాలు పాలసీల్లో ప్రతిఫలిస్తుంటాయనీ, అవి భవిష్యత్ తరాలను ప్రభావితం చేస్తాయనీ, కాబట్టి దేని గురించైనా మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలనీ పవర్‌స్టార్ ఆంగ్లంలో సూచించారు. కన్నడిగులు, మరాఠీలు, తమిళులు, హిందీ మాట్లాడే భారతీయులు తమ మాతృభాషను ఎలా పరిరక్షించుకుంటున్నారో, ప్రమోట్ చేసుకుంటున్నారో చూసి నేర్చుకోవాలని ఇంగ్లీషులో హితవు పలికారు.

అలా అని ఆయన మొత్తం ఇంగ్లీషులోనే ట్వీట్ చెయ్యలేదు. మధ్య మధ్యలో తెలుగులోనూ తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. "యాసని, సంస్కృతిని అవమానపరిచారు  అంటేనే -తెలంగాణ విడిపోయింది; మరి మాతృ భాషని అగౌరపరిచి, ఉనికిని చంపేస్తానంటే ఏం జరుగుతుందో నాయకులూ ఊహించగలరా???" అని తెలుగులోనే ప్రశ్నించారు. "మన భాషని, మన సంస్కృతిని మనం చిన్నపరుచుకుంటే ఎలా?? ఇంగ్లీష్ నేర్పాలి కానీ, విద్యావిధానంలో మాతృభాషని అగౌరపరిచే పద్ధతి మానుకోవాలి" అని సలహా ఇచ్చారు. అయితే ఆయన చేసిన ట్వీట్సన్నీ విపరీతంగా ట్రోల్స్‌కు గురయ్యాయి. ఆయన చదువునీ, ఆయన చేసుకున్న పెళ్లిళ్లనీ, ఆయన పిల్లలు చదువుతున్న మీడియంనీ ప్రస్తావిస్తూ, ఆయనను వ్యక్తిగతంగా కించపరుస్తూ వందలమంది ట్రోల్స్ చేస్తున్నారు. వాటిలో కొన్నింటిని చూస్తే చాలు.. ఏ రేంజిలో ఆయన ట్రోల్స్‌కు గురవుతోందీ అర్థమవుతుంది.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.