అమితాబ్జీ.. ఇట్లు మీ అభిమాని, ఆరాధకుడు పవన్ కల్యాణ్!
on Jul 12, 2020
అమితాబ్ బచ్చన్‌కు కరోనా వైరస్ సోకిందని తెలియగానే తను తీవ్రమైన బాధకు గురయ్యానని పవర్‌స్టార్, జనసేనాని పవన్ కల్యాణ్ తెలిపారు. త్వరలోనే అమితాబ్, అభిషేక్ ఇద్దరినీ ఆరోగ్యవంతులుగా చూడాలనుకుంటున్నట్లు చెప్పారు. తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా స్పందించిన ఆయన తను అమితాబ్ అభిమానిని, ఆరాధకుడనని వెల్లడించారు. అంతేకాదు, అలనాడు కూలీ సినిమా షూటింగ్లో అమితాబ్ తీవ్రంగా గాయపడినప్పుడు ఆయన మామూలు మనిషి కావాలని తమ కుటుంబమంతా ప్రార్థించిందంటూ గుర్తు చేసుకున్నారు.
పవన్ కల్యాణ్ ట్వీట్ నోట్లోని పూర్తి పాఠం...
"నా ప్రియమైన, గౌరవనీయులైన శ్రీ అమితాబ్ బచ్చన్ జీ,
'కూలీ' షూట్లో మీరు గాయపడినప్పుడు మీకు స్వస్థత చేకూరాలని మా అమ్మానాన్నలు సహా మా ఇంటిల్లిపాదీ ప్రార్థించడాన్ని చాలా స్పష్టంగా ఇప్పటికీ గుర్తు చేసుకుంటుంటాను. అన్ని వయసుల వారి నుంచీ మీరెప్పుడూ అలాంటి అద్భుతమైన ప్రేమనీ, నమ్మకాన్నీ, అనురాగాన్నీ పొందుతూ వస్తున్నారు. కేవలం మీ ప్రతిభ కారణంగానే కాకుండా మీ పోరాటతత్వం, సింప్లిసిటీ, నమ్రత వల్ల కూడా మేం మిమ్మల్నిప్రేమిస్తూ వస్తున్నాం. మీరు, అభిషేక్ గారు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యారని తెలిసిన క్షణం నాలో తీవ్రమైన బాధ కలిగింది. తన స్వస్థతా శక్తులతో ఆ ధన్వంతరి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. మీ ఇద్దరినీ మంచి ఆరోగ్యంతో చూడాలని ఎదురుచూస్తుంటాను.
మీ అభిమాని, ఆరాధకుడు
పవన్ కల్యాణ్"
Also Read