English | Telugu

'ఒక చిన్న విరామం' మూవీ రివ్యూ

on Feb 14, 2020

నటీనటులు: పునర్నవి భూపాలం, నవీన్ నేని, సంజయ్ వర్మ, గరీమా సింగ్ తదితరులు
కూర్పు: అశ్వత్ శివకుమార్ 
సినిమాటోగ్రఫీ: రోహిత్ బి 
సంగీతం: భరత్ మాచిరాజు
రచన-నిర్మాణం-దర్శకత్వం: సందీప్ చేగురి 
విడుదల తేదీ: 14 ఫిబ్రవరి 2020

'ఉయ్యాల జంపాలా'తో గుర్తింపు తెచ్చుకున్న తెలుగమ్మాయి పునర్నవి భూపాలం. తర్వాత రెండు మూడు సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. అవేవీ హిట్ కాలేదు. మొన్నామధ్య 'బిగ్ బాస్ 3'లోకి వెళ్లొచ్చాక మళ్లీ ఆమెకు కొంచెం క్రేజ్ వచ్చింది. మళ్లీ 'ఒక చిన్న విరామం'లో హీరోయిన్ గా చేశారు. ఇందులో నవీన్ నేని హీరో. సంజయ్ వర్మ, గరీమా సింగ్ మరో జంటగా నటించారు. సందీప్ చేగురి దర్శకుడిగా పరిచయమైన ఈ సినిమా ఎలా ఉంది? రివ్యూ చదివి తెలుసుకోండి. 

కథ:

వైఫ్ సమీర (గరీమా సింగ్) డెలివరీ డేట్ దగ్గరలో ఉందనీ, ఆమెకు తోడుగా ఉండాల్సిన అవసరం ఉందనీ తెలిసినా... ఇంట్లో ఒంటరిగా వదిలేసి దీపక్ (సంజయ్ వర్మ) ఒక పని మీద బయటకు వెళతాడు. ఏ పని మీద బయటకు వెళుతున్నాడో చెప్పడు. అతడికి అంత అర్జెంట్ పని ఏముంది? దారిలో కార్ సడన్ గా ఆగిపోయినా... మరొకరిని లిఫ్ట్ అడిగి మరీ ఎందుకు వెళ్లాడు? దీపక్ కి లిఫ్ట్ ఇచ్చిన బాలా (నవీన్ నేని), మాయ (పునర్నవి భూపాలం) ఎవరు? ఈ నలుగురికి ఫుడ్ అడిక్టివ్ డ్రగ్ కి సంబంధం ఏమిటి? తదితర ప్రశ్నలకు సమాధానం సినిమా చూసి తెలుసుకోవాలి.   

విశ్లేషణ:

దర్శకుడు సందీప్ చేగురి విజువల్స్ సెన్స్, కామెడీ సెన్స్... రెండు బాగున్నాయి.‌ ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలలో ఇంకా బ్యూటిఫుల్ ఫోటోగ్రఫీ ఎవరు చూసి ఉండరు. విజువల్ పరంగా 'ఒక చిన్న విరామం' పెద్ద సినిమాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉంది. అలాగే, కామెడీ కూడా చాలా బాగుంది. ఆల్మోస్ట్ ఫస్ట్ హాఫ్ అంతా కార్ లోనే జరుగుతుంది. అయితే... ప్రేక్షకులకు మరీ బోర్ కొట్టని విధంగా కొన్ని సన్నివేశాలను సందీప్ రాశారు. తీశారు కూడా! నవీన్ నేని, పునర్నవి భూపాలం పాత్రలకు పెట్టిన ఇంటిపేర్లు నవ్వు తెప్పిస్తాయి. ఆ ఇంటి పేర్ల మీద రెండు మూడు జోకులు కూడా వేశాడు. అవేంటో ఇప్పుడు చెప్తే సినిమా చూసే వాళ్లకు కిక్ ఉండదు. దర్శకుడు కావాలనుకునే యువకుడు నవీన్ నేని. హీరోయిన్ కావాలనుకునే అమ్మాయి పునర్నవి. వీళ్లిద్దరూ స్నేహితులు. కాదు కాదు ప్రేమికులు. వీళ్ళ మధ్య ట్రాక్ ను బాగా రాశారు. అయితే... ఫస్టాఫ్ అయ్యేసరికి ఈ ట్రాక్ తప్ప కథలో విషయం ఏంటనేది పెద్దగా చెప్పలేదు. దాంతో థియేటర్లో ప్రేక్షకులకు కొంచెం సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. సెకండాఫ్ కి వచ్చేసరికి కథ లోకి వెళ్లినా... పాయింట్ చిన్నది కావడంతో మధ్యలో కథను రెండు మలుపులు తిప్పారు. అవి ప్రేక్షకులు ఊహించదగినవే. పతాక సన్నివేశం కొంచెం బాగా తెరకెక్కించారు. అయితే... విజువల్ నేరేషన్ మీద దర్శకుడు ఎక్కువ దృష్టి పెట్టడంతో సినిమా మరీ నిదానంగా వెళుతున్న భావన కలుగుతుంది. టూ మచ్ స్లో నేరేషన్. స్క్రీన్ ప్లే వీక్. అలా కాకుండా రేసి గా స్క్రీన్ ప్లే రాసి ఉంటే... సన్నివేశాలు చకచకా కదులుతుంటే బాగుండేది. సినిమాల్లో గొప్ప విషయం ఏంటంటే... పాటలు కథకు అడ్డు తగ్గలేదు. ఫస్ట్ హాఫ్ లో కథలో కి వెళ్లేముందు ఒక పాట వచ్చింది. సెకండ్ హాఫ్ లో మరో పాట వస్తుంది. సినిమా నిడివి కూడా తక్కువే. గంటన్నర మాత్రమే.

ప్లస్‌ పాయింట్స్‌:
పునర్నవి-నవీన్ నేని మధ్య సీన్స్
రోహిత్ బి సినిమాటోగ్రఫీ
కాన్సెప్ట్ 

మైనస్‌ పాయింట్స్‌:
స్టోరీ లైన్ చాలా చిన్నది
స్లో నేరేషన్
వీక్ స్క్రీన్ ప్లే
ఫస్టాఫ్ లో అసలు కథేమీ చెప్పలేదు

నటీనటుల పనితీరు:
సంజయ్ వర్మ, గరీమా సింగ్ పాత్రలకు తగ్గట్టు చక్కటి అభినయాన్ని కనబరిచారు. సినిమాకు అసలు సిసలైన హీరో హీరోయిన్లు నవీన్ నేని, పునర్నవి భూపాలం. ఇద్దరి కామెడీ టైమింగ్, కెమిస్ట్రీ కేక. ఇద్దరు చాలా బాగా చేశారు. విలన్ పాత్రలో నటించిన వ్యక్తి పర్వాలేదు. అతనికి బదులు మరింత ఆవేశం ఆగ్రహం చూపించే నటుడిని ఎవరినైనా తీసుకుంటే ఆ సన్నివేశాలు బాగా పండేవి.

తెలుగుఒన్‌ పర్ స్పెక్టివ్:

ఒక చిన్న కాన్సెప్ట్ తో, తక్కువ పాత్రలతో తీసిన చక్కటి ప్రయత్నం 'ఒక చిన్న విరామం'. ఇటువంటి కాన్సెప్ట్ సినిమాలకు ఎటువంటి లోపాలు లేకుండా చూసుకోవడం ముఖ్యం.‌ నేరేషన్ స్పీడ్ స్పీడ్ గా ఉంటే... ప్రతి సన్నివేశం ఉత్కంఠకు గురి చేసేలా తెరకెక్కించేలా ఉంటే బావుండేది. హాలీవుడ్ కాన్సెప్ట్ ఫిలిమ్స్ తరహాలో దర్శకుడు తెరకెక్కించారు. అద్భుతంగా ఉందని చెప్పలేం. అలాగని, మరీ చెత్త చిత్రం అని చెప్పలేం.

రేటింగ్‌: 1.5/5


Cinema GalleriesLatest News


Video-Gossips