ఎన్టీఆర్ బయోపిక్ ట్రైలర్ రివ్యూ
on Dec 21, 2018
ఎన్టీఆర్ అనే ఈ మూడు అక్షరాల పేరు వింటే ప్రతి తెలుగువాడి గుండె గర్వపడుతుంది. తెలుగుజాతి బ్రతికున్నంత కాలం ఆ పేరు వినబడుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఎన్టీఆర్ మానవుడిగా జన్మించి మరణించాడు. దేవుడిలా ప్రజల గుండెల్లో నిలిచిపోయాడు. అలాంటి గొప్పవ్యక్తి జీవిత చరిత్ర సినిమా రూపంలో మన ముందుకి రాబోతుంది. బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ లాగానే ట్రైలర్ కూడా విశేషంగా ఆకట్టుకుంటుంది. 'ఆ రామారావు ఏంటి? కృష్ణుడు ఏంటి? మార్చు' అనే డైలాగుతో ట్రైలర్ మొదలవుతుంది. మొదటగా బాలకృష్ణ కృష్ణుడు రూపంలో దర్శనమిస్తాడు. తెలుగువారికి రాముడు, కృష్ణుడు అంటే మొదటగా ఎన్టీఆర్ గుర్తుకొస్తారు. ఆ పాత్రల్లో అంతగా ఒదిగిపోయారు ఆయన. అలాంటి కృష్ణుడి పాత్రలో ఇప్పటికే పాండురంగడు వంటి సినిమాలో నటించి మెప్పించిన బాలకృష్ణ.. ఈ ట్రైలర్ లో కృష్ణుడు పాత్రలో మరింత ఒదిగిపోయారు. కృష్ణుడు పాత్రలో ఒదిగిపోయారు అనే కంటే ఎన్టీఆర్ పాత్రలో పరకాయప్రవేశం చేసారు అనడం కరెక్టేమో. ఎందుకంటే ప్రతి ఫ్రేమ్ లో బాలకృష్ణ ఎన్టీఆర్ లానే కనిపించారు. బాలక్రిష్ణని చూస్తుంటే నిజంగా ఎన్టీఆర్ ని చూసినట్లే ఉంది. కీరవాణి అందించిన మ్యూజిక్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని చెప్పుకోవాలి. 'నన్ను దేవుడ్ని చేసిన మనుషుల కోసం నేను మళ్ళీ మనిషిగా మారడానికి సిద్ధంగా ఉన్నాను' లాంటి మాటలతో మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా తన కలం బలం మరోసారి చూపించారు. మొత్తానికి ఈ ట్రైలర్ ఎన్టీఆర్ అభిమానులకు కనులపండుగ అని చెప్పాలి. దర్శకుడు క్రిష్ బాలకృష్ణని ఎన్టీఆర్ లా చూపించడంలో సక్సెస్ అయ్యారు. ట్రైలర్ చూస్తుంటే ఎన్టీఆర్ చరిత్రను చరిత్రలో నిలిచిపోయేలా క్రిష్ తెరకెక్కించారు అనిపిస్తోంది.