ఎన్టీఆర్కి ఆహ్వానం లేదు!?
on Dec 17, 2018
నందమూరి హరికృష్ణ మరణం తరవాత... ముఖ్యంగా 'అరవింద సమేత వీరరాఘవ' చిత్ర విజయోత్సవం తరవాత... బాబాయ్ బాలకృష్ణ, అబ్బాయ్ ఎన్టీఆర్ మధ్య మనస్పర్థలు తొలిగిపోయాయని, జూనియర్ని బాలయ్య దగ్గర తీశాడని ప్రేక్షకులతో పాటు చిత్ర పరిశ్రమ ప్రముఖులు భావించారు. కానీ, ఇద్దరి మధ్య దూరం తగ్గలేదని నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోన్న బయోపిక్ 'యన్.టి.ఆర్' ఆడియో వేడుక అతిథుల జాబితా చూస్తే అర్థమవుతుందని ఇండస్ట్రీ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. ఈ నెల 21న 'యన్.టి.ఆర్' ఆడియో విడుదల చేయనున్నారు. భారీ ఫంక్షన్ చేయాలని ప్లాన్ చేశారు. దీనికి నందమూరి కుటుంబ సభ్యులతో పాటు సీనియర్ ఎన్టీఆర్ సన్నిహిత నిర్మాతలు, దర్శకులు, నటీనటుల్ని పిలవాలని బాలకృష్ణ నిర్ణయించారు. నందమూరి కుటుంబ సభ్యుల్లో ఎన్టీఆర్ కుమారులు, కుమార్తెలు, మనవళ్లు అందరికీ ఆహ్వానాలు అందాయట. ఒక్క జూనియర్ ఎన్టీఆర్కి తప్ప. అతణ్ణి ఆహ్వానించే విషయంలో బాలకృష్ణ ఇంకా నిర్ణయం తీసుకోలేదని సమాచారం. నటనలోనూ, పేరుతోనూ తాతయ్యకు తగ్గ మనవడు అనిపించుకున్న జూనియర్... తాతయ్య జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా ఆడియో ఫంక్షన్లో కనిపించడం దాదాపుగా అసాధ్యమని ఇండస్ట్రీ టాక్.... ఒకవేళ ఈ రెండు మూడు రోజుల్లో బాలయ్య మనసు మారితే తప్ప!