ఆర్ఆర్ఆర్... నో సీక్వెల్!
on Dec 3, 2018
'బాహుబలి' సినిమా రెండు పార్టులుగా విడుదలైంది కానీ, రాజమౌళి తండ్రి వి. విజయేంద్రప్రసాద్ ఒక్క సినిమా అనుకుని కథ రాయడం మొదలుపెట్టారు. సినిమా బడ్జెట్ వగైరా వగైరా లెక్కలు వేసుకుని రెండు పార్టీలుగా విడుదల చేశారు. వెబ్‌సిరీస్ కోసం ప్రీక్వెల్ తీస్తున్నారు. సీక్వెల్ కూడా వుండొచ్చు! 'బాహుబలి' తరవాత రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సినిమా 'ఆర్ఆర్ఆర్'. రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రానికీ సీక్వెల్ తీసే అవకాశాలు వున్నాయని ప్రచారం జరుగుతోంది. అయితే.. 'ఆర్ఆర్ఆర్'కి సీక్వెల్స్ వుండవని తాజా ఇంటర్వ్యూలో విజయేంద్రప్రసాద్ స్పష్టం చేశారు. ఈ చిత్రానికి 'రామ రావణ రాజ్యం' అని టైటిల్ ఖరారు చేసినట్టు, ఎన్టీఆర్ ప్రతినాయకుడిగా నటిస్తున్నట్టు వచ్చిన వార్తలపైనా ఆయన స్పందించారు. టైటిల్ అదేననీ, ఎన్టీఆర్ విలనే అని స్పష్టంగా చెప్పలేదు కానీ.. ఏదో ఒకటి, ఎక్కడో ఒక చోట కలుస్తుందని విజయేంద్రప్రసాద్ అన్నారు. వచ్చే ఏడాది దర్శకుడిగా భారీ చిత్రం చేయబోతున్నట్టు విజయేంద్రప్రసాద్ తెలిపారు. త్వరలో వివరాలు ప్రకటిస్తానని అన్నారు. 'శ్రీకృష్ణ 2006', 'రాజన్న', 'శ్రీవల్లి' చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. వాటిలో 'రాజన్న' తనకు నచ్చిన చిత్రమని అన్నారు. మూడు చిత్రాల్లో ఒకటి ఫెయిల్ అయితే.. మరొకటి సుమారుగా ఆడిందని... ఒకటి బాగా ఆడిందని విజయేంద్రప్రసాదే అన్నారు.