'ఆర్ఆర్ఆర్' సంగీత పనులేవీ జరగట్లేదు!
on Apr 3, 2020
"లాక్డౌన్ సమయంలో పనిమాని ఇంట్లో కూర్చుంటే పోయేది ఏముంది?" అని ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి ప్రశ్నించారు. కుటుంబంతో కాలక్షేపం చేయమని చెప్పారు. మరో రెండు వారాలు బయటకు వెళ్లకూడదంటే వెళ్లకూడదని ఆయన సూచించారు. ప్రస్తుతం తానూ సినిమా పనులేవీ చేయడం లేదని ఆయన అన్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న తాజా సినిమా 'రౌద్రం రణం రుధిరం'.
ఇటీవల రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన పోషిస్తున్న అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ టీజర్ విడుదల చేశారు. ఆ టీజర్ పనులు పూర్తయిన తరవాత ఆయన మరో పని చేయలేదట. దానికి కూడా ఎన్టీఆర్ చేత ఆన్లైన్లో డబ్బింగ్ చెప్పించానని కీరవాణి తెలిపారు. ఆ తరవాత నుండి 'ఆర్ఆర్ఆర్' పనులేవీ జరగడం లేదని ఆయన స్పష్టం చేశారు. బహుశా... లాక్డౌన్ ముగిసిన తరవాత ప్రారంభిస్తారని సమాచారం. ఈ సినిమా కాకుండా పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా సహా మరో రెండు మూడు సినిమాలకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు.