తండ్రీ కూతురు... రచ్చరచ్చ చేశారు!
on Oct 30, 2017
ఇది ఇంటర్నెట్ యుగం. ఎంటర్టైన్మెంట్ కి ఇప్పుడు ఎన్నో దారులు. ముఖ్యంగా సోషల్ మీడియా పెరిగాక... టైమ్ పాస్ కి కొదవే లేకుండా పోయింది. ఒకప్పుడు సినిమాలు మాత్రమే ఎంటర్టైన్మెంట్ కోసం ఉండేది. ఆ తర్వాత టీవీ సీరియళ్లు వచ్చేశాయ్. షాట్ ఫిలిమ్సూ.. వెబ్ సిరీస్ లు అబ్బో.. ఎటు చూసినా హాడావిడే. ప్రస్తుతం అయితే... వెబ్ సిరీస్ రాజ్యం ఏలుతున్నాయ్. షాట్ ఫిలిమ్స్ ని పక్కన పెట్టేసి.. అందరూ వెబ్ సిరీస్ పైనే పడ్డారు.
మెగా ఫ్యామిలీ దృష్టి కూడా ఈ వెబ్ సిరీస్ లపై మళ్లడం విశేషం. మెగా బ్రదర్ నాగబాబు, ఆయన కుమార్తె నిహారిక కలిసి ఓ వెబ్ సిరీస్ చేశారు. పేరు ‘నాన్న కూచి’. ఈ తండ్రీ కూతురూ నిజజీవిత బంధాన్నే కెమెరా ముందు కూడా కొనసాగించారు. అంటే.. తెరపై కూడా తండ్రీ కూతురే అన్నమాట. రీసెంట్ గా ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన టీజర్ ఒకటి విడుదలైంది. ఆ టీజర్ లో ఈ తండ్రీ కూతుర్ని చూస్తే... రెండు కళ్లూ చాలడం లేదంటే నమ్మండి. ఈ పాత్రల పుణ్యమా అని... ఈ తండ్రీ కూతురికి నటించాల్సిన అవసరం లేకుండా పోయింది.
చక్కగా ఇంట్లో ఎలా ఉంటారో.. అలాగే కెమెరా ముందు కూడా మసలారు. ఆ తండ్రికి కూతురుపై ఎంత ప్రేమ ఉందో... ఆ కూతురికి తండ్రంటే ఎంత ఇష్టమో.. ఈ ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది. పైగా ఈ వెబ్ సిరీస్ లో నిహారికాకు ఓ లవ్ స్టోరీ ఉంది. అలాగే.. నాగబాబుకు కూడా ఓ లవ్ స్టోరీ ఉంది. సినిమాకు ఏ మాత్రం తక్కువ కాకుండా అద్భుతమైన క్వాలిటీతో... దర్శకుడు బి.ప్రణీత్ ఈ వెబ్ సిరీస్ ని తీశాడు. చక్కని సంగీతం, ఆహ్లాదకరమైన కెమెరా మనితనం, సంభాషణలు ఈ వెబ్ సిరీస్ హైలైట్స్. ఏదిఏమైనా... వెబ్ సిరీస్ కల్చర్ కే స్టార్ స్టేటస్ తెచ్చెలా ఉంది టీజర్. ఇలాగే టాలీవుడ్ టాప్ స్టార్స్ కూడా ఈ వెబ్ సిరీస్ వైపు ఓ లుక్ ఏస్తే... కచ్చితంగా ఇది కూడా టీవీ సీరియల్స్ రేంజ్ కి వెళ్తాయ్. ఏమంటారు?