తండ్రి కోసం కమ్మరివాడిగా మారిన 'కేజీఎఫ్' మ్యూజిక్ డైరెక్టర్!
on Apr 2, 2020
ప్రస్తుతం నెలకొని వున్న దారుణ పరిస్థితుల్లో ఒక దానితో ప్రపంచం పోరాడుతోంది. ప్రాణాంతక కరోనావైరస్ మొత్తం మానవాళిని ప్రమాదంలో పడేసింది. కరోనా వ్యాప్తిని నిరోధించడానికి, వివిధ దేశాల నేతలు తమ పౌరుల్ని ఇళ్లల్లోనే ఉండాలనీ, బయటకు రావద్దనీ కోరుతున్నారు. భారత్‌లో ప్రధాని నరేంద్ర మోదీ 21 రోజుల పూర్తి స్థాయి లాక్డౌన్ ప్రకటించారు. దీంతో పేద ప్రజల, దినసరి వేతన జీవుల బతుకులు దారుణంగా ప్రభావితమయ్యాయి. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఇతరుల జీవితాలు కూడా ప్రభావితమవుతున్నాయి.
దానికి వాస్తవ రూపం ఇస్తూ ఒక వ్యక్తి తన వీడియోలతో అందరినీ ఆశ్చర్య చకితుల్ని చేస్తున్నాడు. అతను సాధారణ వ్యక్తి కాదు.. రాకీ భాయ్ అలియాస్ యష్ హీరోగా నటించగా దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన 'కేజీఎఫ్' మూవీ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్. అతనిచ్చిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ 'కేజీఎఫ్'ను వేరే లెవల్‌కు తీసుకెళ్లిందనేది నిజం. రోజుకు రూ. 35 సంపాదనతో తండ్రికి సాయం చేయడానికి తన గ్రామంలో అతను కమ్మరి అవతారం ఎత్తాడు.
ఈ సంక్షోభ కాలంలో తన తండ్రికి ఎలా సాయం చేస్తున్నాడో ఫేస్బుక్లో షేర్ చేసిన వీడియోల ద్వారా అతను తెలియజేశాడు. ఆ వీడియోలకు అతను, "పాత జ్ఞాపకాలను నెమరు వేసుకోవడానికి దేవుడు మనకు సాయం చేస్తాడు. ఆయన చేతుల్లో మనం తోలుబొమ్మలం" అనే క్యాప్షన్ జోడించాడు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తండ్రి కోసం రవి బస్రూర్ చేస్తున్న పనిని చాలా మంది ప్రశంసిస్తున్నారు.