సరికొత్త చరిత్రకు సమాయత్తమవుతున్న ట్రిపుల్ ఆర్!
on Apr 1, 2020
ఆర్ఆర్ఆర్.. ఇప్పుడు ఈ మూడక్షరాల పేరు ఇండియాలోనే అల్టిమేట్ సెల్లింగ్ బ్రాండ్ అయిపోయింది. బాహుబలి సినిమాలతో తెలుగు సినిమాని దేశవ్యాప్తం చేసిన.. ఆ మాటకొస్తే ప్రపంచవ్యాప్తం చేసిన యస్.యస్. రాజమౌళి ఈ సినిమాని రూపొందిస్తుండటం దీనికి ఒక కారణమైతే, టాలీవుడ్లో ఒకే తరానికి చెందిన ఇద్దరు మాస్ స్టార్స్.. జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్.. హీరోలుగా నటిస్తుండటం ఇంకో కారణం. ఈ సినిమాకు సంబంధించిన ఏ చిన్న అంశమైనా అది హెడ్‌లైన్స్‌లో చోటు చేసుకుంటూ వస్తోందంటేనే ఒక బ్రాండ్‌గా ఆర్ఆర్ఆర్ ఎంత క్రేజ్ తెచ్చుకుందో ఊహించుకోవచ్చు.
తెలుగులో ఈ సినిమాకు 'రౌద్రం రణం రుధిరం' అనీ, హిందీ వెర్షన్‌కు 'రైజ్ రోర్ రివోల్ట్' అనీ టైటిల్ ఖాయం చేసినప్పటికీ, మొదట్నించీ ట్రిపుల్ ఆర్ అని పిలుస్తూ వస్తున్నందున ఇప్పటికే ఆ టైటిల్‌తోటే ఈ సినిమాని ప్రస్తావిస్తూ వస్తున్నారు. యుట్యూబ్లో ఉగాది సందర్భంగా రిలీజ్ చేసిన టైటిల్ లోగో మోషన్ పోస్టర్‌కు కానీ, ఆ తర్వాత మూడు రోజులకు రామ్‌చరణ్ బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చేసిన అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ టీజర్‌కు కానీ వచ్చిన రెస్పాన్స్ అసాధారణం. వీటితో దేశవ్యాప్తంగా ట్రిపుల్ ఆర్ బ్రాండ్ మారుమోగిపోయింది. ఒకవైపు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ, లాక్డౌన్ అమలుతో ఆందోళనకర పరిస్థితులు నెలకొని ఉన్నా 'భీమ్ ఫర్ రామరాజు' వీడియో సాధించిన పాపులారిటీ అసామాన్యం అనే చెప్పాలి. మోషన్ పోస్టర్, రామరాజు క్యారెక్టర్ టీజర్లను విశ్లేషిస్తూ వచ్చిన కథనాలు ఎన్నో!
1920 కాలంలో భీమునిపట్నం దగ్గర పాండ్రంగికి చెందిన క్షత్రియ యువకుడు అల్లూరి రామరాజు, తెలంగాణలోని సంకేపల్లికి చెందిన గోండు యువకుడు కొమరం భీమ్ తమ తమ ఇళ్లను వదిలిపెట్టి ఎక్కడకు వెళ్లారు, ఏం చేశారు, ఎలా కలుసుకున్నారు.. ఆ ఇద్దరి కలయిక ఎలాంటి సన్నివేశాన్ని ఆవిష్కరించిందనే విజయేంద్రప్రసాద్ సృష్టించిన ఫిక్షనల్ స్టోరీతో రాజమౌళి రూపొందిస్తోన్న 'రౌద్రం రణం రుధిరం'లో రామ్‌చరణ్ జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్, జూనియర్ ఎన్టీఆర్ జోటీగా బ్రిటీష్ థియేటర్ ఆర్టిస్ట్ ఒలీవియా మోరిస్ నటిస్తున్నారు. రెండు కీలక పాత్రలను బాలీవుడ్ స్టార్ యాక్టర్ అజయ్ దేవ్‌గణ్, తమిళ టాలెంటెడ్ యాక్టర్ సముద్రకని చేస్తున్నారు.
మోషన్ పోస్టర్, రామరాజు క్యారెక్టర్ టీజర్లకు ఎం.ఎం. కీరవాణి ఇచ్చిన బీజీయం, సెంథిల్‌కుమార్ సినిమాటోగ్రఫీ టెక్నికల్‌గా ట్రిపుల్ ఆర్ ఏ రేంజిలో ఉండబోతోందో శాంపుల్ చూపించాయి. సాయిమాధవ్ బుర్రా రాస్తున్న సంభాషణలు ఈ సినిమాకు ఎస్సెట్ అని యూనిట్ మెంబర్స్ చెబుతున్నారు.
ఓవరాల్‌గా యూట్యూబ్‌లో ట్రిపుల్ ఆర్‌పై ఎన్ని స్టోరీలు వచ్చాయో, వస్తున్నాయో లెక్కలేదు. ఎప్పుడో 2021 జనవరి 8న ఆ సినిమా విడుదల ఉన్నప్పటికీ ఏడాది క్రితం నుంచే ట్రిపుల్ ఆర్ బాక్సాఫీస్ కలెక్షన్లపై ఎన్నో రకాల అంచనాలు వెలువడుతూ వస్తున్నాయి. 300 కోట్ల రూపాయల అంచనా బడ్జెట్‌తో నిర్మాణమవుతున్న ఈ మూవీ ఈజీగా వెయ్యి కోట్ల కలెక్షన్‌ను దాటేస్తుందని పేరుపొందిన విశ్లేషకులే నమ్ముతున్నారు.
ఇక సోషల్ మీడియాలో ట్రిపుల్ ఆర్‌పై జరుగుతున్న ప్రచారం, చర్చ అయితే ఊహాతీతం. బహుశా హాలీవుడ్లో వచ్చిన మార్వెల్, డీసీ సినిమాలకూ ఈ రేంజి చర్చలు జరిగి వుండవు. సోషల్ మీడియా రెస్పాన్స్ ఎలా ఉందో ఒక్కసారి మనం పరిశీలిద్దాం. ఇది తెలుగువన్ మాత్రమే అందిస్తోన్న ఎక్స్‌క్లూజివ్ కవరేజ్.
సోషల్ మీడియాలో ట్రిపుల్ ఆర్ మూవీకి సంబంధించిన అప్డేట్స్పై వచ్చిన రెస్పాన్స్‌ను ఓసారి పరిశీలిస్తే, 55.3 శాతం పాజిటివ్‌గా, 43.8 శాతం న్యూట్రల్‌గా కనిపిస్తుంది. కేవలం 0.9 శాతం మాత్రమే నెగటివ్‌గా రెస్పాండ్ అయ్యారని తెలుస్తోంది.
ఉగాది సందర్భంగా రిలీజ్ చేసిన టైటిల్ లోగో మోషన్ పోస్టర్ విషయంలో కానీ, ఇమేజెస్ విషయంలో కానీ ట్రిపుల్ ఆర్ టీమ్‌ను నెటిజన్లు ప్రశంసల్లో ముంచెత్తారు.
టైటిల్ లోగో అద్భుతంగా ఉందనీ, ఇదివరకు రాజమౌళి సినిమా బాహుబలి 2 క్రియేట్ చేసిన రికార్డుల్ని కానీ, బాలీవుడ్ టాప్ మూవీల రికార్డుల్ని కానీ ఈజీగా బ్రేక్ చేసి, సరికొత్త చరిత్రను సృష్టిస్తుందనీ వాళ్లు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.
రామ్‌చరణ్ బర్త్‌డే సందర్భంగా మార్చి 28న రిలీజ్ చేసిన భీమ్ ఫర్ రామరాజు వీడియోకు వచ్చిన రెస్పాన్స్ అయితే ఊహాతీతం. రాజమౌళి ప్రతిసారీ తనపై పెట్టుకున్న అంచనాలను మించి ప్రోడక్ట్ ఇస్తూ వస్తున్నాడని పొగిడిన నెటిజన్లు, టీజర్లో అల్లూరి సీతారామారాజుగా చరణ్ కనిపించిన తీరు, అతని బాడీ లాంగ్వేజ్, అతని పర్ఫార్మెన్స్ అద్భుతమని ప్రశంసల్లో ముంచెత్తారు. అదే సమయంలో రామరాజును పాత్రను కొమరం భీమ్ పాత్రధారిగా జూనియర్ ఎన్టీఆర్ పరిచయం చేసిన విధానాన్నీ, అతని వాయిస్ ఓవర్‌ను కూడా తెగ మెచ్చుకున్నారు.
ట్రిపుల్ ఆర్ మూవీకి సంబంధించి లేటెస్టుగా ట్రెండ్ అయిన కీ వర్డ్స్ ఏవంటే.. మోషన్ పోస్టర్, టైటిల్ లోగో, ఫైర్ అండ్ వాటర్, బ్రదర్ అండ్ ఫ్యాన్స్.
ఇక నెటిజన్లు ఎక్కువగా మోషన్ పోస్టర్, ఇమేజెస్, టీజర్, రామ్‌చరణ్ వీడియో, తారక్ వాయిస్‌లకు సంబంధించిన న్యూస్‌లను షేర్ చేశారు.