ENGLISH | TELUGU  

తారక్ హీరోయిన్ వచ్చేసింది! ఇంటర్నేషనల్ మూవీగా 'ఆర్ ఆర్ ఆర్'!!

on Nov 20, 2019

 

2020లో తెలుగు సినీసీమ మాత్రమే కాదు, యావద్భారత చిత్రసీమలోనే మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీగా చెప్పుకోదగ్గ 'ఆర్ ఆర్ ఆర్' మూవీకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. యస్.యస్. రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో రాంచరణ్ జోడీగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా, జూనియర్ ఎన్టీఆర్ సరసన నాయికగా నటిస్తున్నదెవరనే విషయం నిన్నటిదాకా ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్‌లా ఉండిపోయింది. ఈరోజు, అంటే నవంబర్ 20న ఆ చిక్కు విడిపోయింది. తారక్ జోడీగా ఇంగ్లిష్ బ్యూటీ ఒలీవియా మోరిస్ 'ఆర్ ఆర్ ఆర్' సెట్స్‌పైకి వచ్చేసింది. ఆమె జెన్నిఫర్ అనే బ్రిటిష్ యువతి కేరెక్టర్‌ను పోషిస్తోంది. వాస్తవానికి మొదట ఈ కేరెక్టర్‌కు మరో బ్రిటిష్ తార డైసీ ఎడ్గార్ జోన్స్ ఎంపికైన విషయం తెలిసిందే. అయితే కొద్ది రోజులకే ఆమె 'ఆర్ ఆర్ ఆర్' నుంచి తప్పుకుంది. వ్యక్తిగత కారణాల వల్లే తాను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని ఆమె ప్రకటించింది. 

ఇది జరిగి దాదాపు 7 నెలలు గడిచాయి. అప్పట్నుంచీ తారక్ జోడీగా వచ్చే అమ్మాయి ఎవరు? అనే ప్రశ్న సినీ వర్గాల్లో, 'ఆర్ ఆర్ ఆర్' మూవీ అభిమానుల్లో నలుగుతూ వచ్చింది. కొద్ది రోజుల క్రితం తారక్ జోడీగా ఎమ్మా రాబర్ట్స్ ఎంపికైందనే వార్త హల్‌చల్ చేసింది. 'నర్వ్', 'లిటిల్ ఇటలీ', 'ప్యారడైజ్ హిల్స్'లో నటించిన ఎమ్మా.. 'ఆర్ ఆర్ ఆర్'లో ఎంపికైన విషయాన్ని సినిమా యూనిట్‌లోని ఎవరూ ధృవీకరించలేదు. దాంతో అది ఒక రూమర్‌గానే ఉండిపోయింది. ఇప్పుడు అది రూమర్ అనే విషయం స్పష్టమైంది. తారక్ సరసన నటించడానికి ఒలీవియా మోరిస్ వచ్చేసింది. ఆమె ఇప్పటి వరకూ 'కండెమ్డ్' అనే హారర్ మూవీ, '7 ట్రయల్స్ అండ్ 7 డేస్' అనే టీవీ సిరీస్‌లో నటించింది. ఆమె యూకేలోని 'ద రాయల్ వెల్ష్ కాలేజీ ఆఫ్ మ్యూజిక్ అండ్ డ్రామా'లో నటనలో శిక్షణ పొందింది. 'ఆర్ ఆర్ ఆర్' కథ ప్రకారం జెన్నిఫర్ అనే బ్రిటిష్ యువతి ప్రేమలో పడతాడు కొమరం భీం. అయితే వాళ్ల ప్రేమకు ఎన్నో అవరోధాలు కలుగుతాయి. బ్రిటిష్ దుష్ట దంపతులు స్కాట్, లేడీ స్కాట్ ఆ యువజంట పాలిట విలన్లుగా మారతారు. ఆ పాత్రల్ని రే స్టీవెన్‌సన్, అలీసన్ డూడీ పోషిస్తున్నారు. 

హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ 'థోర్' చూసినవాళ్లకు 'వోల్‌స్టాగ్' కేరెక్టర్ గుర్తుండే ఉంటుంది. థోర్ ప్రధాన అనుచరుడైన ఆ కేరెక్టర్‌ను చేసింది రే స్టీవెన్సన్. జన్మతహా ఐరిష్ అయిన స్టీవెన్సన్ మొదట రంగస్థల నటుడిగా రాణించి, ఆ తర్వాత హాలీవుడ్ సినిమాల్లోనూ, అమెరికన్ టెలివిజన్ సీరియళ్లలోనూ నటించి, ప్రతిభావంతుడైన యాక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. హాలీవుడ్‌లో మంచి డిమాండ్ ఉన్న నటుడైన అతను ఒక భారతీయ చిత్రంలో.. అందునా ఒక ప్రాంతీయ భాషా చిత్రంలో నటించేందుకు అంగీకరించడం విశేషంగా భావించాలి. 'బాహుబలి' డైరెక్టర్‌గా యస్.యస్. రాజమౌళికి విశ్వవాప్తంగా వచ్చిన పేరు ప్రఖ్యాతుల వల్లే, ఆయన 'ఆర్ ఆర్ ఆర్'లో నటించేందుకు ఒప్పుకున్నాడనుకోవాలి. స్టీవెన్సన్ రాకతో 'ఆర్ ఆర్ ఆర్' సినిమాకి గొప్ప ప్రయోజనం కలుగుతుందనేది కాదనలేని సత్యం.

ఇక స్కాట్ భార్య లేడీ స్కాట్‌గా నటిస్తోన్న అలీసన్ డూడీ సైతం ఐరిష్ యాక్టరే. ప్రస్తుతం 53 ఏళ్ల వయసున్న ఆమె హాలీవుడ్ గ్రేట్ ఫిలింస్‌లో ఒకటైన 'ఇండియానా జోన్స్ అండ్ లాస్ట్ క్రూసేడ్'లో హారిసన్ ఫోర్డ్, సీన్ కేనరీ చేసిన పాత్రలతో సమానంగా ఎల్సా ష్నైడర్ అనే ప్రధాన పాత్ర చేసి ప్రేక్షకుల ఆరాధ్య తారగా అవతరించింది. ఆ తర్వాత కూడా 'మేజర్ లీగ్ 2', 'టెంప్టేషన్', 'కింగ్ సాల్మన్స్ మైన్స్' వంటి సినిమాలు చేసింది. లేడీ స్కాట్‌గా ఆమె 'ఆర్ ఆర్ ఆర్'కు ప్రత్యేక ఆకర్షణ తీసుకు రానున్నది. అటు రే స్టీవెన్సన్, ఇటు అలీసన్ డూడీ వంటి హాలీవుడ్ యాక్టర్లను తీసుకోవడం ద్వారా 'ఆర్ ఆర్ ఆర్'కు ఇంటర్నేషనల్ మూవీ కలర్ తీసుకొచ్చేశాడు రాజమౌళి. యు.ఎస్.లో 'ఆర్ ఆర్ ఆర్'కు మంచి పబ్లిసిటీ తీసుకురావడంలో ఆ ఇద్దరు నటులూ కచ్చితంగా ఉపయోగపడనున్నారు. 'బాహుబలి' సినిమాలు దేశవ్యాప్తంగా రాజమౌళికి కీర్తి ప్రతిష్ఠలు తీసుకు రాగా, 'ఆర్ ఆర్ ఆర్' మూవీ అంతర్జాతీయంగా ఆయనకు పేరు తెచ్చే అవకాశాలున్నాయి. అదే సమయంలో బిజినెస్ పరంగానూ ఈ సినిమా కొత్త రికార్డులు సృష్టించడం ఖాయం.

జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్, అజయ్ దేవగణ్, అలియా భట్, సముద్రకని, రే స్టీవెన్సన్, అలిసన్ డూడీ, ఒలీవియా మోరిస్.. ఈ పేర్లు చదువుతుంటేనే.. 'ఆర్ ఆర్ ఆర్' ఏ రేంజిలో తయారవుతోందో ఊహించుకోవచ్చు. అల్లూరి సీతారామరాజు, కొమరం భీం వంటి విప్లవ వీరుల పాత్రలతో, కల్పిక గాథతో తయారవుతున్న ఈ మూవీ భారతీయ చలన చిత్ర చరిత్రలో నిలిచిపోయే మరో గొప్ప సినిమా అని ఇప్పట్నుంచే నమ్మాలనిపిస్తోంది. చూద్దాం.. రాజమౌళి ఏం మాయ చేస్తాడో!


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.