తమన్ మళ్లీ కొట్టాడు.. ఈసారి 'వెంకీ మామ' కోసం!
on Nov 16, 2019
తమన్ క్రేజ్ మామూలుగా లేదు. 'అల.. వైకుంఠపురములో' పాటలు అంబరాన్నంటే ఆదరణ పొందగా, లేటెస్టుగా 'వెంకీ మామ' కోసం అతడు ట్యూన్స్ ఇచ్చిన 'ఎన్నాళ్లకో ఎన్నేళ్లకో వంటికాయ సొంటికొమ్ము సెంటు కొట్టెరో..' అనే పాటను సంగీత ప్రియులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా నటిస్తున్న 'వెంకీ మామ' సినిమాకు తమన్ సంగీత దర్శకుడు. బాబీ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీలో వెంకీ జోడీగా పాయల్ రాజ్‌పుత్, చైతూ సరసన రాశీ ఖన్నా నటిస్తున్నారు. శనివారం (నవంబర్ 16) తమన్ పుట్టినరోజును పురస్కరించుకొని నిర్మాతలు 'ఎన్నాళ్లకో ఎన్నోళ్లకో' లిరికల్ సాంగ్‌ను ఆదిత్యా మ్యూజిక్ ద్వారా యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు.
వీడియో మొదట్లో హైపర్ ఆదితో చైతూ "ఈ ముల్లేదో 20 ఏళ్ల క్రితం గుచ్చుకొనుంటే.." అని చెప్పి ఆలోచనల్లో పడటంతో సాంగ్ మొదలైనట్లు చూపించారు. రెట్రో స్టైల్లో కలర్ఫుల్గా తీసిన ఈ పాట వినడానికీ, చూడ్డానికీ ఇంపుగా ఉందనేది నిజం. వెంకటేశ్, పాయల్ ఇద్దరూ కలర్‌ఫుల్ డ్రస్సులతో అదరగొట్టారు. బెల్‌బాటం ప్యాంటులతో బాగా యంగ్ లుక్‌లో వెంకటేశ్ ఆకట్టుకుంటే, స్టైలిష్ డ్రస్సులతో బ్యూటిఫుల్‌గా కనిపిస్తూ అలరించింది పాయల్. పాట ప్రకారం సినిమాలో పాయల్ 'టీచరమ్మ'గా కనిపిస్తుందని తెలిసిపోయింది. వెంకీ రైతు పాత్రను చేస్తున్నారు. 'ఏ ఊహలూ లేని గుండెలో కొత్త కలల విత్తనాలు మొలకలేసెరో' అనే లైన్ చూస్తే అప్పటిదాకా మనవాడు ప్రేమ అంటే ఎరుగడనీ, టీచర్ని చూసి మనసు పారేసుకున్నాడనీ అర్థమైపోతోంది. మొదట్లో చైతన్య చెప్పిన మాటలూ దీన్ని బలపరుస్తున్నాయి. ఈ లెక్కన వెంకీ మిడిల్ ఏజ్డ్ పర్సన్ అనేది స్పష్టం. పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిన అతడిలో టీచర్ కదలిక తెచ్చిందన్న మాట.
తమన్ స్వరాలు, శ్రీమణి సాహిత్యం, పృథ్వీచంద్ర గానం, రాజు సుందరం కొరియోగ్రఫీ, ప్రసాద్ మురెళ్ల సినిమాటోగ్రఫీ, బ్రహ్మ కడలి ఆర్ట్ వర్క్ కలిసి ఈ పాటను అందంగా మలిచాయి. 'వెంకీ మామ' సినిమాకి సంబంధించిన రెండో పాట వచ్చి, ఆకట్టుకుంది. మిగతా పాటల కోసం ఎదురుచూసేలా చేసింది. ఇప్పుడు తమన్ టైం నడుస్తోంది. అతని సంగీతం 'వెంకీ మామ'కు పెద్ద ఎస్సెట్ అవుతుందనేది సత్యం.
Also Read