'ఆర్ ఆర్ ఆర్'లో అజయ్ దేవగణ్ కేరెక్టర్ ఇదేనా?
on Oct 12, 2019
దేశమంతా ఒక డైరెక్టర్ తీస్తున్న సినిమా కోసం ఎదురుచూస్తూ ఉంటుందని మనకు తెలుసు. ఆ డైరెక్టర్.. ఎస్.ఎస్. రాజమౌళి. 'బాహుబలి' సినిమాలతో ఇండియాస్ టాప్ డైరెక్టర్‌గా మారిన ఆయన.. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ హీరోలుగా 'ఆర్ ఆర్ ఆర్' మూవీ రూపొందిస్తున్నాడు. పాన్ ఇండియా లుక్ కోసం రాంచరణ్ జోడీగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్‌ను, తమిళ స్టార్ కేరెక్టర్ ఆర్టిస్ట్ సముద్ర కనిని ఆయన తీసుకున్నాడు. అలాగే బాలీవుడ్ టాప్ యాక్టర్లలో ఒకడైన అజయ్ దేవ్‌గణ్ ఈ మూవీలో ఒక కీలక్ కేరెక్టర్ చేస్తున్నాడని చాలా కాలం క్రితమే రాజమౌళి ప్రకటించాడు. శంకర్ డైరెక్ట్ చేసిన '2.0' మూవీలో అక్షయ్ కుమార్ ఎలాగైతే విలన్‌గా కనిపించాడో, అదే తరహాలో అజయ్ దేవగణ్ సైతం 'ఆర్ ఆర్ ఆర్'లో విలన్‌గా కనిపించనున్నాడంటూ వదంతులు వినిపించాయి. దాంతో పాటు రాంచరణ్ తండ్రి కేరెక్టర్లో ఆయన కనిపించనున్నాడంటూ కూడా ప్రచారం జరిగింది.
అయితే అజయ్ చేస్తున్నది విలన్ కేరెక్టర్ కాదనీ, ఆయనది హీరోలను తీర్చిదిద్దే గురువు తరహా కేరెక్టర్ అనీ తాజాగా ఆన్లైన్లో ప్రచారంలోకి వచ్చింది. తెల్లవాళ్లపై తిరగబడ్డ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రాంచరణ్, రజాకార్లకు నిద్రలేకుండా చేసిన గోండు వీరుడు కొమరం భీమ్ గా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. అయితే నిజమైన పాత్రలతో, ఫిక్షనల్ స్టోరీతో ఈ మూవీని రాజమౌళి తీస్తున్నాడు. పోరాట యోధులుగా మారక ముందు సమకాలికులైన ఆ ఇద్దరూ.. తమ ఇళ్లను, ఊళ్లను విడిచిపెట్టి మూడు నాలుగేళ్ల పాటు ఎక్కడెక్కడో తిరిగి వచ్చారని వాళ్ల జీవిత కథలు చెప్పాయి కానీ, ఆ కాలంలో వాళ్లు ఎక్కడ ఉన్నారనే విషయం చరిత్రలో చెప్పలేదు. దాన్నే కథగా తీసుకొని.. ఆ ఇద్దర్నీ యోధులుగా తీర్చిదిద్దిన గురువుగా అజయ్ దేవగణ్‌ను 'ఆర్ ఆర్ ఆర్'లో రాజమౌళి చూపిస్తున్నాడంటూ ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజమెంత ఉందో కాలమే చెబుతుంది.